
ప్రస్తుత కాలంలో ప్రతీఒక్కరి దగ్గర క్రెడిట్ కార్డు అనేది కనిపిస్తోంది. ఉద్యోగులు, వ్యాపారులే కాకుండా సామాన్యులు కూడా ఇటీవల వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. కొంతమంది ఆఫర్ల కోసం పొదుపుగా ఉపయోగించుకుని లాభపడుతుంటే.. మరికొంతమంది విచ్చలవిడిగా ఖర్చు పెట్టి బిల్లులు చెల్లించలేక అప్పులపాలవుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల క్రెడిట్ కార్డు అప్పుల నుంచి బయటపడవచ్చు. ప్రజలకు ఆర్ధిక సలహాలు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి క్రెడిట్ కార్డు జాగ్రత్తగా ఎలా వాడాలి? అప్పుల నుంచి ఎలా బయటపడాలి? అనేది వివరించారు. రిచ్ డాడ్ వెబ్సైట్లో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.
అప్పులు అవుతున్నా చాలామంది క్రెడిట్ కార్డులను వాడుతూనే ఉంటారు. ఇలా చేయకూడదని కియోసాకి చెప్పారు. క్రెడిట్ కార్డు తాత్కాలికంగా బ్లాక్ చేయడం లేదా కొంతకాలం పాటు పనిచేయకుండా నిలిపివేయడం లాంటివి చేయాలి. మీరు షాపింగ్‌కు వెళ్లేటప్పుడు క్రెడిట్ కార్డును తీసుకెళ్లడం మానేసి నగదు రూపంలో చెల్లించడం లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లించే ప్రయత్నం చేయాలి. అలాగే మీ అప్పుల జాబితా మొత్తం ఎంత అనేది లెక్క వేసుకుని ఒక స్ప్రెడ్‌షీట్‌లో పెట్టుకోవాలి. ప్రతి అప్పుపై నెలకు ఎంత చెల్లిస్తున్నారు.. దీనిని తీర్చడానికి ఎన్ని నెలలు పడుతుంది అనేది రాసుకోవాలి. మినిమం బ్యాలెన్స్ మాత్రమే చెల్లిస్తే ఎన్ని నెలల్లో అప్పు తీరుతుందనేది ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల త్వరగా మీరు అప్పు తీర్చే అవకాశం ఉంటుందని రాబర్ట్ కియోసాకి స్పష్టం చేశారు.
మీకు ఇతర రుణాలు ఉన్నప్పటికీ ముందుగా క్రెడిట్ కార్డు లోన్, బిల్లులు తీర్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్రెడిట్ కార్డు లోన్లకు అధిక వడ్డీతో పాటు బకాయి చెల్లించకపోతే భారీగా పెనాల్టీలు పడతాయి. దీంతో ముందుగా క్రెడిట్ కార్డులో తక్కువ నెలలు ఉన్న రుణాన్ని తీర్చే ప్రయత్నం మొదలుపెట్టి, ఆ తర్వాత అత్యధిక నెలలు ఉన్న అప్పును తీర్చాలని సూచించారు. అప్పులు త్వరగా తీర్చేందుకు మీ ఖర్చులు తగ్గించుకోండి. దీని వల్ల పొదుపు అయ్యే డబ్బులతో బిల్లులు చెల్లించండి. మీకు ఒకే ఆదాయం ఉంటే మరో ఆదాయ మార్గం కూడా చూడండి. ఏదైనా చిన్న పని చేయడం లాంటివి చేయండి. దీని వల్ల త్వరగా అప్పు తీరుతుంది.
మీ దగ్గర డబ్బులు ఉంటే క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయకండి. మీ దగ్గర ఉన్న డబ్బుతో చెల్లింపులు చేయండి. దీని వల్ల క్రెడిట్ కార్డు వినియోగం అనేది తగ్గుతుంది. అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం తగ్గడం వల్ల అప్పుల్లోకి మీరు వెళ్లే అవకాశం ఉండదు. అత్యవసరమైతే తప్ప క్రెడిట్ కార్డు ఉపయోగించవద్దని రాబర్ట్ కియోసాకి తన బ్లాగ్‌లో తెలిపారు.