
ప్రస్తుతం దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సుమారు 78.65 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తోంది. పేదలకు నిత్యావసరాలు సరఫరా చేసేందుకు దేశవ్యాప్తంగా సుమారు 5.51 లక్షల రేషన్ షాపులు పనిచేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2026-2027లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,27,429 కోట్లకు పైగా కేటాయించింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ పథకం ద్వారా 2029 వరకు రేషన్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంత పెద్ద వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం పెంచడానికి కేంద్రం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటుది. ఇప్పటికే ఆధార్ అథెంటికేషన్, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈపీఓఎస్) మెషిన్లు, వన్ నేషన్- వన్ రేషన్ కార్డ్ వంటి డిజిటల్ విధానాలను తీసుకొచ్చింది. అయితే రేషన్ సరుకులు పక్కదారి పట్టడాన్ని అరికట్టేందుకు డిజిటల్ వోచర్ సిస్టమ్ ప్రతిపాదనను కేంద్రం తీసుకురానుందని తెలుస్తోంది. జనవరి 2026లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పీడీఎస్ సిస్టమ్‌లో ఎన్పీసీఐ ఈ-రూపీ ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానించడానికి ఒక కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను ఇష్యూయర్ బ్యాంక్‌గా.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)ని సాంకేతిక భాగస్వామిగా సూచించారు.
ఈ-రూపీ అనేది ఒక డిజిటల్ వోచర్. ఇది నిర్దిష్ట ప్రయోజనం కోసం మాత్రమే జారీ చేసే వోచర్. మీ కుటుంబానికి నెలవారీ 10 కిలోల బియ్యం కేటాయింపు ఉంటే.. దానికి సంబంధించిన డిజిటల్ వోచర్ జనరేట్ అవుతుంది. ఈ వోచర్లో 10 కేజీ రైస్ వోచర్ అని ఉంటుంది. కానీ డబ్బు విలువ ఉండదు. దీనిని మరొకరికి బదిలీ చేయడం లేదా నగదుగా మార్చుకోవడం సాధ్యం కాదు. నిర్దిష్ట ఆహార ధాన్యాల కోసం మాత్రమే దీనిని ఉపయోగించాల్సి ఉంటుంది. లబ్దిదారుల అర్హత వివరాలను ఎస్బీఐకి పంపుతారు. ఎస్బీఐ, ఎన్పీసీఐ ఈ-రూపీ ప్లాట్‌ఫామ్‌తో కలిసి లబ్ధిదారుడి కోసం ప్రత్యేక వోచర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ వోచర్ ఆధార్‌తో లింక్ అయిన లబ్ధిదారుడి వివరాలతో అనుసంధానించబడి ఉంటుంది. వోచర్ జనరేట్ అయిన తర్వాత లబ్ధిదారుడి మొబైల్‌కు ఎస్ఎంఎస్ లేదా క్యూఆర్ కోడ్ రూపంలో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మేరా రేషన్ యాప్ ద్వారా కూడా దీనిని యాక్సెస్ చేయవచ్చు. లబ్ధిదారులు తమ స్థానిక రేషన్ షాప్‌కు వెళ్లి ఫోన్లోని ఎస్ఎంఎస్ లేదా క్యూఆర్ కోడ్‌ను డీలర్‌కు చూపుతారు. డీలర్ ఈపీఓఎస్ మెషిన్ ద్వారా వోచర్‌ను స్కాన్ చేస్తారు లేదా వోచర్ ఐడీని నమోదు చేస్తారు.
ఆధార్ అనుసంధానిత వివరాలు ఓటీపీ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ధృవీకరించబడతాయి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అర్హత ప్రకారం సరుకులను అందిస్తారు. రేషన్ పంపిణీ పూర్తయిన తర్వాత లావాదేవీ వివరాలు డిజిటల్ సిస్టమ్‌లో రికార్డ్ అవుతాయి. ఎస్బీఐ, బ్యాంకులు, సంబంధిత వ్యవస్థల మధ్య సెటిల్మెంట్ జరుగుతుంది. డీలర్ కమిషన్ వివరాలు కూడా నమోదు చేయబడతాయి. దీనిని ఏటీఎం నుండి నగదుగా మార్చుకోవడం సాధ్యం కాదు. వోచర్‌ను వేరొకరికి బదిలీ చేయలేరు. లబ్ధిదారుడు మాత్రమే రీడీమ్ చేయాల్సి ఉంటుంది.