Mall Economics: వ్యాపార రహస్యాలు.. షాపింగ్ పెద్దగా చేయకపోయినా మాల్య జమానికి కోట్లు ఎలా వస్తున్నాయి?

Mall Economics: మాల్స్ విజయానికి సింగిల్ ఓనర్‌షిప్ అత్యంత కీలకం. అంటే, మొత్తం మాల్ ఒకే కంపెనీ లేదా ట్రస్ట్ ఆధీనంలో ఉండాలి. ఇక్కడ దుకాణాలను లీజుకు మాత్రమే ఇస్తారు. అమ్మరు. ఇది జోనింగ్, కేటగరైజేషన్, డిజైన్‌పై పూర్తి నియంత్రణను అందిస్తుంది..

Mall Economics: వ్యాపార రహస్యాలు.. షాపింగ్ పెద్దగా చేయకపోయినా మాల్య జమానికి కోట్లు ఎలా వస్తున్నాయి?
Mall Economics

Updated on: Nov 18, 2026 | 10:26 AM

మనం వీకెండ్స్‌లో సరదాగా మాల్స్‌కు వెళ్లినప్పుడు, చాలామంది కేవలం షాపులను చూసి, విండో షాపింగ్ చేసి, ఫోటోలు దిగి వెనక్కి వస్తుంటారు. అయితే, వేల కోట్ల కన్‌స్ట్రక్షన్, నిరంతర ఏసీ, మెయింటెనెన్స్ ఖర్చులతో నడిచే మాల్స్, జనాలు పెద్దగా షాపింగ్ చేయకపోయినా ఎలా లాభాలు ఆర్జిస్తాయనేది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. దీని వెనుక కేవలం అద్దెలు మాత్రమే కాకుండా, అనేక వ్యూహాత్మక ఆర్థిక రహస్యాలు ఉన్నాయి.

సైలెంట్ పార్టనర్‌షిప్:

సాధారణ దుకాణాలకు భిన్నంగా, మాల్‌లోని అద్దె విధానం మినిమం గ్యారెంటీ ప్లస్ రెవెన్యూ షేరింగ్ మోడల్పై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం, దుకాణాలు నెలవారీ కనీస అద్దెను (ఉదాహరణకు, రూ. 3 లక్షలు) తప్పనిసరిగా చెల్లించాలి. అదనంగా, వారి మొత్తం అమ్మకాలలో 7-10% మాల్ యజమానికి రెవెన్యూ షేర్‌గా ఇస్తారు. ఒకవేళ అమ్మకాలు బాగా జరిగి, రెవెన్యూ షేర్ కనీస అద్దె కంటే ఎక్కువగా ఉంటే (ఉదాహరణకు, రూ. 5 లక్షలు), మాల్ యజమాని ఆ అధిక మొత్తాన్ని స్వీకరిస్తాడు. అమ్మకాలు తక్కువగా ఉన్నప్పుడు, కనీస అద్దెను మాత్రం వసూలు చేస్తాడు. అంటే, దుకాణదారుడికి లాభాలు వస్తే యజమాని కూడా వాటా పంచుకుంటాడు. నష్టాలు వస్తే మాత్రం అతనికి ఎలాంటి నష్టం ఉండదు.

ఇది కూడా చదవండి: Pure Groundnut Oil: 50 కిలోల పల్లీలకు ఎంత నూనె వస్తుంది? ఎంత ఖర్చు అవుతుంది?

మాల్ బిజినెస్‌లో రెండు రకాల దుకాణదారులు ఉంటారు: యాంకర్ టెనెంట్లు (పెద్ద బ్రాండ్లు, హైపర్‌మార్కెట్లు, మల్టీప్లెక్స్‌లు), వనిల్లా టెనెంట్లు (చిన్న వాచెస్ షాపులు, కేక్ షాపులు). మెగా బ్రాండ్లకు మాల్ యజమానులు తక్కువ అద్దెకు లేదా అసలు అద్దే లేకుండా కేవలం 2-3% రెవెన్యూ షేర్‌తో పెద్ద స్థలాన్ని ఇస్తారు. కొన్నిసార్లు వారి ఇంటీరియర్ ఖర్చులను కూడా భరిస్తారు. ఎందుకంటే ఈ పెద్ద బ్రాండ్‌లు ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేసి వేలాది మంది కస్టమర్లను మాల్‌లోకి ఆకర్షిస్తాయి. మాల్ యజమాని ఈ “ఫుట్‌ఫాల్”ను ఒక ఉత్పత్తిగా భావించి, చిన్న వనిల్లా టెనెంట్లకు అధిక ప్రీమియం అద్దెకు అమ్ముతాడు (చదరపు అడుగుకు రూ. 400-600). అంటే, పెద్ద బ్రాండ్‌ల ద్వారా వచ్చిన జనాలను చిన్న దుకాణాలకు మళ్లించి డబ్బు సంపాదిస్తాడు.

మాల్ డిజైన్ కూడా ఒక పక్కా సైకలాజికల్ ట్రాప్. దీనిని ది గ్రువెన్ ఎఫెక్ట్ అంటారు. సినిమా హాళ్లు, గేమింగ్ జోన్‌లను ఎప్పుడూ పై అంతస్తుల్లో ఉంచుతారు. అక్కడికి చేరుకోవడానికి కస్టమర్‌లు అనేక ఎస్కలేటర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక ఎస్కలేటర్ పైకి వెళ్ళాక, తర్వాతి ఎస్కలేటర్ దానికి వ్యతిరేక దిశలో, చాలా దూరం నడిస్తేనే లభిస్తుంది. ఈ నడకలో కస్టమర్‌లు అనేక షాపులు, డిస్కౌంట్‌లను చూసి, షాపింగ్ మూడ్‌లోకి వెళ్తారు. సినిమా పూర్తయిన తర్వాత ఎగ్జిట్ గేట్‌లు నేరుగా ఫుడ్‌కోర్ట్‌లోకి తెరుచుకునేలా డిజైన్ చేస్తారు. మూడు గంటలు సినిమా చూసి ఆకలితో ఉన్న కస్టమర్లకు ఫుడ్‌కోర్ట్ ఆకర్షణీయంగా కనిపించి, అధిక ధరలకు ఆహారాన్ని కొనుగోలు చేస్తారు. ఫుడ్‌కోర్ట్‌లో అమ్మకాలపై 15-25% రెవెన్యూ షేర్ వసూలు చేస్తారు. ఇది మాల్ యజమానికి అత్యంత లాభదాయకమైన ఆదాయ వనరు.

మాల్‌లోని కారిడార్‌లలోని చిన్న కియోస్క్‌లు కూడా అధిక అద్దెలు చెల్లిస్తాయి (చదరపు అడుగుకు రూ. 800-1500). అట్రియమ్‌లలో కార్పొరేట్ బ్రాండ్స్ తమ ఉత్పత్తుల ప్రమోషన్ల కోసం రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు చెల్లిస్తాయి. సాధారణ ప్రాంతాల మెయింటెనెన్స్ ఛార్జీల ద్వారా కూడా మాల్స్ పెద్ద మొత్తంలో నిధులు సేకరిస్తాయి (నెలకు కోటిన్నర నుండి మూడున్నర కోట్ల రూపాయలు). మాల్స్‌లో ప్రతి దుకాణం బిల్లింగ్ సిస్టమ్ మాల్ కేంద్ర సర్వర్‌కు అనుసంధానించి ఉంటుంది. దీని ద్వారా మాల్ మేనేజ్‌మెంట్కు ప్రతి అమ్మకం నిజ సమయంలో తెలుస్తుంది. ఫోరెన్సిక్ ఆడిట్‌లు, సీక్రెట్ కస్టమర్ల ద్వారా అమ్మకాల్లో పారదర్శకతను నిర్ధారిస్తారు.

మాల్స్ విజయానికి సింగిల్ ఓనర్‌షిప్ అత్యంత కీలకం. అంటే, మొత్తం మాల్ ఒకే కంపెనీ లేదా ట్రస్ట్ ఆధీనంలో ఉండాలి. ఇక్కడ దుకాణాలను లీజుకు మాత్రమే ఇస్తారు. అమ్మరు. ఇది జోనింగ్, కేటగరైజేషన్, డిజైన్‌పై పూర్తి నియంత్రణను అందిస్తుంది. దీనికి విరుద్ధంగా, భారతదేశంలో విఫలమైన మాల్స్ చాలావరకు స్ట్రాటా సెల్లింగ్ వల్ల మూతపడతాయి. ఇందులో బిల్డర్ దుకాణాలను చిన్న ఇన్వెస్టర్లకు అమ్మేస్తాడు. దీంతో 200 మంది యజమానులు ఉండటం వల్ల కేంద్రికృత నియంత్రణ, విజన్ లోపించి, మాల్ గందరగోళంగా మారి కస్టమర్లను కోల్పోతుంది. ఒక విజయవంతమైన మాల్ నెలవారీగా రూ. 12-13 కోట్ల గ్రాస్ రెవెన్యూను, అంటే సంవత్సరానికి రూ. 150 కోట్లు ఆర్జించగలదు. అప్పులు, పన్నులు తీరాక, ఈ కాంక్రీట్ బిల్డింగ్ యజమానికి ఒక ప్రైవేట్ ట్యాక్స్ కలెక్షన్ బూత్‌గా మారుతుంది.

ఇది కూడా చదవండి: Toll Plazas: మీ వాహనానికి ఇది లేకుండా టోల్‌ ప్లాజా నుంచి వెళ్తున్నారా? రూ.10 వేల పెనాల్టీ..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us