Jio IPO: 2.5 లక్షల కోట్ల ఆఫర్లు.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న జియో ఐపీఓ క్రేజ్..

ఇంకా మార్కెట్లోకి రానేలేదు.. అప్పుడే ఏకంగా రూ. 2.5 లక్షల కోట్ల ఆఫర్లు.. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రిలయన్స్ జియో ఐపీఓ సంచలనం సృష్టిస్తుంది. సింగపూర్, అబుదాబి ప్రభుత్వ ఫండ్ల నుంచి ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ బ్లాక్‌రాక్, మన దేశీయ ఎల్‌ఐసీ వరకు బడా ఇన్వెస్టర్లంతా జియో షేర్ల కోసం పోటీ పడుతుండటంతో దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఫీవర్ మొదలైంది.

Jio IPO: 2.5 లక్షల కోట్ల ఆఫర్లు.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న జియో ఐపీఓ క్రేజ్..
Jio Ipo Rs 2.5 Lakh Crore Investor Interest

Updated on: Oct 17, 2026 | 6:18 PM

దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలవనున్న రిలయన్స్ జియో ఐపీఓ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. ఇష్యూ ఇంకా మార్కెట్‌లోకి రాకముందే గ్లోబల్, డొమెస్టిక్ దిగ్గజ సంస్థల నుంచి కనీవినీ ఎరుగని స్పందన లభిస్తోంది. బిగ్ ఇన్వెస్టర్లు ఇప్పటికే ఏకంగా రూ. 2.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించినట్లు మార్కెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జియో ఐపీఓలో భారీ ఎత్తున వాటాలు దక్కించుకునేందుకు ప్రపంచంలోని అత్యంత సంపన్న ప్రభుత్వ సంపద నిధులు క్యూ కట్టాయి. సింగపూర్, నార్వే, అబుదాబి, ఖతార్‌లకు చెందిన ప్రభుత్వ ఫండ్‌లు ఇందులో పెట్టుబడులకు సిద్ధమైనట్లు సమాచారం. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో వేల కోట్ల డాలర్లను శాసించే బ్లాక్‌రాక్, ఫిడిలిటీ, క్యాపిటల్ గ్రూప్ వంటి ప్రముఖ గ్లోబల్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలు కూడా జియోలో ఇన్వెస్ట్ చేసేందుకు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నాయి.

దేశీయ దిగ్గజాలూ సై.. రంగంలోకి ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ..

భారత మార్కెట్ దిగ్గజాలు కూడా ఈ ఐపీఓ రేసులో ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీతో పాటు, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ వంటి అగ్రశ్రేణి సంస్థలు జియో షేర్ల కోసం పోటీ పడుతున్నాయి. దేశంలోని టాప్ 10 మ్యూచువల్ ఫండ్‌లు, టాప్-5 ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం ఇందులో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారీ సంస్థాగత ఇన్వెస్టర్ల ఎంట్రీ ఈ ఐపీఓ విజయానికి అత్యంత కీలకం కానుంది.

కేవలం టెలికాం మాత్రమే కాదు.. డిజిటల్ సామ్రాజ్యంపై గురి

జియో వ్యాపారం కేవలం 4G, 5G మొబైల్ సేవలకే పరిమితం కాలేదు. హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్, క్లౌడ్ సర్వీసెస్, ఓటీటీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ సొల్యూషన్స్ వంటి విస్తారమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను జియో నిర్మించింది. అందుకే ఇన్వెస్టర్లు దీన్ని కేవలం ఒక టెలికాం కంపెనీగా చూడటం లేదు. జియో ఐపీఓలో షేర్లు కొనుగోలు చేయడాన్ని దేశ డిజిటల్ విప్లవంలో ప్రత్యక్ష భాగస్వామ్యం దక్కించుకునే అరుదైన అవకాశంగా భావిస్తున్నారు.

ధరల శ్రేణి ఎంతంటే?

జియో ఐపీఓ కోసం ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్‌ను రూ. 1,065 నుంచి రూ. 1,119గా నిర్ణయించారు. రిటైల్ చిన్న ఇన్వెస్టర్లతో పాటు బడా సంస్థాగత ఇన్వెస్టర్లకు కూడా ఇదే ధర వర్తిస్తుంది. అంటే మార్కెట్‌లోని అందరు మదుపరులకు సమానమైన ఇష్యూ ధరే అందుబాటులో ఉండనుంది.

బిడ్డింగ్ ఎప్పటి నుంచి?

ఈ క్రేజీ ఐపీఓ అక్టోబర్ 21న సబ్‌స్క్రిప్షన్ కోసం మార్కెట్‌లో ప్రారంభమై, అక్టోబర్ 23తో ముగియనుంది. పెట్టుబడిదారులు షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us