
భారతీయ రైల్వేలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ముఖ్యమైన సదుపాయాన్ని అందిస్తోంది. ప్రయాణ బీమా పథకాన్ని ఐఆర్‌సీటీసీ అమలు చేస్తోంది. కేవలం 45 పైసలు చెల్లిస్తే రూ.10 లక్షల బీమా కవరేజీ పొందవచ్చు. ఇది మీ రైలు ప్రయాణాలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ బీమా పాలసీ రైలు ప్రయాణాలలో సంభవించే ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది. రైలు ప్రమాదంలో గాయాలై ఆస్పత్రిలో చేరినప్పుడు ప్రయాణికులకు రూ.2 లక్షల వరకు బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇక ప్రమాదం కారణంగా పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షల వరకు అందుతుంది. ప్రమాదంలో శాశ్వతంగా వైకల్యం చెందితే రూ.10 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణిస్తే.. నామినీకి రూ.10 లక్షల వరకు అందిస్తారు.
ఈ బీమా పథకం భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని పొందగలరు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సీటు బుక్ చేయకపోతే ఈ బీమా వర్తించదు. ఐదు నుండి 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్లు బుక్ చేసినట్లయితే వారికి కూడా బీమా వర్తిస్తుంది. ఐఆర్సీటీసీ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ బీమా ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. బుకింగ్ పూర్తయిన తర్వాత ప్రయాణికుడికి ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా బీమా సమాచారం అందుతుంది. ఈ సమాచారంలో పాలసీ నంబర్, ఇతర ముఖ్య వివరాలు ఉంటాయి. ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్ వివరాలలో ఈ పాలసీ సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు.
బీమా కంపెనీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నామినీ వివరాలను పొందుపర్చాలి. నామినేషన్ సమాచారం నింపకపోతే.. క్లెయిమ్ విషయంలో కుటుంబసభ్యులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇది ప్రక్రియను క్లిష్టతరం చేయవచ్చు. అందువల్ల బీమా ప్రయోజనాలు సకాలంలో, సరైన వ్యక్తికి చేరాలంటే నామినీ వివరాలను సకాలంలో అప్‌డేట్ చేయడం మంచిది. ఈ చిన్న ప్రీమియంతో లభించే భారీ కవర్‌తో మీ రైలు ప్రయాణాలకు భద్రత పొందవచ్చు. ఇండియన్ రైల్వేస్, ఐఆర్సీటీసీ ఈ బీమా సౌకర్యం కల్పిస్తోంది. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ కోరుతోంది. కేవలం 45 పైసలకు రూ.10 లక్షల కవరేజీ పొందవచ్చు. ప్రమాదవశాత్తూ జరిగే ఘటనలకు దీని ద్వారా రక్షణ పొందవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది.