
ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు కేవలం పెట్రోల్, డీజిల్ విక్రయాల రంగంలోనే ఉండగా.. ఇప్పుడు మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. అదే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్. ఇండియన్ ఆయిల్ బ్రాండ్ పేరుతో డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను తీసుకురానుంది. దేశవ్యాప్తంగా ఉన్న 43 వేలకుపైగా తమ రిటైల్ అవుట్‌లెట్లలో ఈ వాటర్ బాటిళ్లను అందుబాటులోకి ఉంచి విక్రయించనుంది. ఇంధనం విక్రయంతోనే కాకుండా ఇతర ఆదాయ మార్గాలను కూడా ఇండియన్ ఆయిల్ ఆన్వేషిస్తోంది. తమ ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది.
ఈ క్రమంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను తీసుకురావాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భావిస్తోంది. అంతేకాకుండా ప్రజలను నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో వీటిని తీసుకొస్తుంది. తొలుత హైవేలపై ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టనుండగా.. ఆ తర్వాత నగరాలు, పట్టణాల్లో తీసుకురానున్నారు. అనంతరం పాక్షిక పట్టణ కేంద్రాలకు విస్తరించనున్నారు. పెట్రోల్ బంకుల్లో ఈ వాటర్ బాటిళ్లను విక్రయించున్నారు. దీంతో ప్రజలు వీటిని పెట్రోల్ పంప్‌ల వద్ద కొనుగోలు చేయవచ్చు. వాటర్ బాటిళ్ల తాయరీ, నాణ్యత, సరఫరా చేయడం, లాజిస్టిక్స్ నిర్వహణ, విస్తరణ కోసం అగ్రిగేటర్లుగా వ్యవహరించడానికి సంస్థలను ఆహ్వానిస్తోంది. బ్రాండ్ ఇండియన్ ఆయిల్ వద్దనే ఉంటుంది. భాగస్వాములు ఆమోదించిన కేంద్రాల నుంచే పూర్తిస్థాయి అమలును నిర్వహిస్తారు.
అగ్రిగేటర్ల నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వనిస్తోంది. తొలుత 21,435 హైవే రిటైల్ అవుట్ లెట్లలో ఇది ప్రారంభమవుతుంది. జాతీయ రహదారులపై ప్రయాణం చేసేందుకు వాటర్ కోసం చాలామంది వెతుకుంటూ ఉంటారు. దీంతో వారికి ఉపయోకరకంగా ఉండేందుకు తొలుత హైవేల పక్కన ఉంటే అవుట్ లెట్లలో ప్రారంభించనున్నారు. అనంతరం పట్టణాల్లో వ్యాపారం స్టార్ట్ చేయనున్నారు. లీటర్ ప్యాక్‌తో పాటు 250 ఎంఎల్, 500 ఎంఎల్ సైలు బాటిళ్లను కూడా ప్రవేశపెట్టనున్నారు. ప్రీమియం వాటర్ బాటిళ్లతో పాటు సహజ మినరల్ వాటర్, ఆల్కలైన్ వాటర్, ఫంక్షనల్ హైడ్రేషన్ ఉత్పత్తులను కూడా తీసుకురావాలని భావిస్తోంది. కేవలం తమ అవుట్ లెట్లలోనే వీటిని విక్రయిస్తారు. కంపెనీ యాజమాన్యంలోని పంప్‌లు, డీలర్ నిర్వహణ పంప్‌లు, కిసాన్ సేవా కేంద్రాల్లో విక్రయించనున్నారు. ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్, షాపుల్లో విక్రయానికి ఉండవు. అతి త్వరలోనే ఈ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లు మార్కెట్లోకి రానున్నాయి. తక్కువ ధరకే వీటిని అందించాలని ఇండియన్ ఆయిల్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రైల్వేశాఖ తమ సొంత బ్రాండ్ వాటర్ బాటిళ్లను రైల్వే ప్రయాణికుల కోసం తీసుకొచ్చింది. ఇప్పుడు అదే తరహాలోనే ఇండియన్ ఆయిల్ సొంత బ్రాండ్ బాటిళ్లను ప్రవేశపెడుతోంది.