మీ ఇంట్లో ఎంతవరకు డబ్బులు దాచుకోవచ్చు..? ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ఇవే.. లిమిట్ దాటితే..

ఇంట్లో నగదు ఉంచడానికి నిర్దిష్ట పరిమితి లేదు, కానీ డబ్బు మూలాన్ని నిరూపించే సాక్ష్యాలు ఉండాలి. రూ.2 లక్షలు మించిన నగదు లావాదేవీలు, నగదు బహుమతులు, బ్యాంకు డిపాజిట్లు, వ్యాపార ఖర్చులు, ఆస్తి లావాదేవీలకు సంబంధించి ఆదాయపు పన్ను నియమాలు, పెనాల్టీలను తెలుసుకోవడం అవసరం.

మీ ఇంట్లో ఎంతవరకు డబ్బులు దాచుకోవచ్చు..? ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ఇవే.. లిమిట్ దాటితే..
Income Tax

Updated on: Nov 19, 2026 | 9:16 PM

మన ఇంట్లో ఎక్కువ నగదు ఉంచుకుంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇబ్బందులు వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత అయినా నగదు దాచుకోవచ్చు. దీనికి ఎలాంటి పరిమితులు విధించలేదు. ఇంట్లో నగదు ఎక్కువ ఉంచుకుంటే నేరమనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఇది పూర్తిగా తప్పు. మీరు ఎన్ని డబ్బులు దాచుకున్నా.. ఆ నగదు ఎక్కడ నుంచి వచ్చిందనే ఆధారాలు మీ దగ్గర ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయానికి సంబంధించి ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదులు, వ్యాపార ఆదాయ రికార్డులు, ఆస్తి అమ్మకం పత్రాలు లేదా వ్యవసాయ ఆదాయానికి సంబంధించిన రశీదులు మీ దగ్గర భద్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి రికార్డులు మీ దగ్గర ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ వద్ద ఉన్న నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోతే.. దానిని బ్లాక్ మనీగా పరిగణిస్తారు. అటువంటి నగదు ఆదాయపు పన్ను శాఖకు దొరికితే.. సెక్షన్ 115BBE కింద భారీ పన్ను, పెనాల్టీలు కట్టాల్సి ఉంటుంది. రూ.కోటి బ్లాక్ మనీ దొరికితే రూ.84 లక్షలు భారీ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. దీంతో బ్లాక్ మనీ ఎప్పుడూ సురక్షితం కాదు.

రూ.2 లక్షల కంటే ఎక్కువ తీసుకుంటున్నారా..?

ఒకే లావాదేవీలో ఒకే రోజున లేదా ఒకే సందర్భంలో రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించడం లేదా చెల్లించడం చట్ట విరుద్ధమని చెప్పుకోవచ్చు. మీరు నగలు, కార్లు, ఫర్నిచర్ లేదా పెళ్లి ఖర్చులు వంటి వాటి కోసం రూ.2 లక్షలు మించి నగదు రూపంలో స్వీకరించకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే నగదు స్వీకరించిన వారికి 100 శాతం భారీ పెనాల్టీ పడుతుంది. అందుకే చాలా మంది వ్యాపారులు రూ.2 లక్షలు మించిన నగదును క్యాష్ రూపంలో తీసుకోరు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే తీసుకోవడం వల్ల డిజిటల్‌గా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఐటీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవ్. ఇక తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్యాభర్తలు వంటి రక్త సంబంధీకుల మధ్య ఇచ్చిపుచ్చుకునే నగదు బహుమతులకు ఎలాంటి పన్ను వర్తించదు.  వివాహ సమయంలో స్వీకరించే నగదు బహుమతులకు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. స్నేహితులు లేదా ఇతర వ్యక్తుల నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేలు దాటిన నగదు బహుమతులపై పన్ను వర్తిస్తుంది. రూ.50 వేలులోపు ఉంటే ట్యాక్స్ ఫ్రీగా చెప్పవచ్చు.

సేవింగ్స్ అకౌంట్లో అంతకంటే ఎక్కువ ఉంచుకుంటున్నారా..?

ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినా లేదా విత్ డ్రా చేసినా, అది ఆటోమేటిక్‌గా ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వెళుతుంది. కరెంట్ ఖాతాలో అయితే ఈ పరిమితి రూ.50 లక్షలుగా ఉంది. ఒకే రోజు రూ.50 వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరి. పన్ను మినహాయింపు పొందాలంటే, దేవాలయాలు లేదా ట్రస్టులకు ఇచ్చే నగదు విరాళం రూ.2 వేలకు మించకూడదు. రూ.2 వేలు మించితే చెక్, ఆన్లైన్ లేదా UPI ద్వారా చెల్లించాలి. అలాగే ఒక వ్యాపార లావాదేవీలో ఒక వ్యక్తికి రోజుకు రూ.10 వేల కంటే ఎక్కువ నగదు చెల్లిస్తే, ఆ ఖర్చును వ్యాపార వ్యయంగా పరిగణించరు. అది లాభంగా భావించి దానిపై పన్ను విధిస్తారు. అలాగే ఆస్తి కొనుగోలు, అమ్మకం లేదా రుణాలు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు రూ.20 వేల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయకూడదు. దీనిని ఉల్లంఘిస్తే డబ్బు ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి 100% పెనాల్టీ పడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us