ITR ఫైలింగ్‌.. HRA మినహాయింపులో భారీ మార్పులు! హైదరాబాద్ వాసులకు 50 శాతం ట్యాక్స్ బెనిఫిట్

కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు-2026 ప్రకారం హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ నగరాలను మెట్రో జాబితాలో చేర్చడంతో జీతభత్యాలు పొందే ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నగరాల్లో నివసించే వారు బేసిక్ జీతంలో 50 శాతం వరకు HRA పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునే అవకాశం పొందనున్నారు.

ITR ఫైలింగ్‌.. HRA మినహాయింపులో భారీ మార్పులు! హైదరాబాద్ వాసులకు 50 శాతం ట్యాక్స్ బెనిఫిట్
Income Tax

Updated on: May 26, 2026 | 7:30 AM

ఉద్యోగులకు హౌజ్‌ రెంటల్‌ అలవెన్స్‌ (HRA) కీలకమైన పన్ను ఆదా సాధనంగా మారింది. అద్దె ఇంట్లో నివసించే ఉద్యోగులు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే HRAపై పాక్షిక పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా వంటి నాలుగు మెట్రో నగరాల్లో నివసించే వారికి మాత్రమే బేసిక్ జీతంలో 50 శాతం వరకు HRA మినహాయింపు వర్తించేది. అయితే కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు-2026 ప్రకారం హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ నగరాలను కూడా మెట్రో జాబితాలో చేర్చడంతో మరింత మంది ఉద్యోగులకు పెద్ద ఊరట లభించనుంది.

ఈ మార్పులతో 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నగరాల్లో నివసించే ఉద్యోగులు తమ బేసిక్ జీతంలో 50 శాతం వరకు HRA మినహాయింపును క్లెయిమ్ చేసుకునే అవకాశం పొందనున్నారు. ప్రస్తుతం నాన్-మెట్రో నగరాల్లో ఈ పరిమితి 40 శాతంగా ఉంది. దీంతో హైదరాబాద్ వంటి నగరాల్లో అధిక అద్దెలు చెల్లిస్తున్న ఉద్యోగులకు ఇది గణనీయమైన పన్ను ఆదాగా మారనుంది. పన్ను నిపుణుల ప్రకారం HRA మినహాయింపు కేవలం పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అద్దె ఇంట్లో నివసిస్తూ ఇంటి యజమానికి వాస్తవంగా అద్దె చెల్లించిన ఉద్యోగులే ఈ ప్రయోజనానికి అర్హులు అవుతారు. ఉద్యోగులు ఫారం-16లో HRA వివరాలు సరిగా ప్రతిబింబించేలా ముందుగానే తమ యజమానికి అద్దె రసీదులు, అద్దె ఒప్పందం వంటి పత్రాలను సమర్పించాలి.

HRA మినహాయింపు లెక్కింపు మూడు అంశాల్లో తక్కువ మొత్తాన్ని ఆధారంగా తీసుకుని జరుగుతుంది. యజమాని నుంచి పొందిన వాస్తవ HRA, మెట్రో నగరాల్లో బేసిక్ జీతంలో 50 శాతం లేదా నాన్-మెట్రో నగరాల్లో 40 శాతం, అలాగే చెల్లించిన అద్దెలో బేసిక్ జీతం 10 శాతం తీసివేసిన మొత్తం, వీటిలో ఏది తక్కువైతే అదే మినహాయింపుగా పరిగణిస్తారు. ITR దాఖలు సమయంలో అద్దె రసీదులు, అద్దె ఒప్పందం, ఇంటి యజమాని PAN, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేదా UPI చెల్లింపు రుజువులు సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వార్షిక అద్దె రూ.1 లక్ష దాటితే ఇంటి యజమాని PAN తప్పనిసరి అవుతుంది. ఇక 2026 ఏప్రిల్ 1 నుంచి HRA క్లెయిమ్‌లపై మరింత కఠినమైన నిబంధనలు అమల్లోకి రావొచ్చని సమాచారం. ముఖ్యంగా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా బంధువులకు అద్దె చెల్లించే వారు తమ సంబంధాన్ని స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో నకిలీ HRA క్లెయిమ్‌లపై ప్రభుత్వం మరింత నిఘా పెట్టే అవకాశం ఉందని పన్ను నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us