Price Hike: సామాన్యులపై మరో పిడుగు.. భారీగా పెరిగిన సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ధరలు.. ఒకేసారి బాదుడు..

దేశంలోని సామాన్యులపై మరో ధరల బాంబ్ పడింది. సబ్బులు, డిటర్జెంట్ ధరలు ఒకేసారి భారీగా పెరిగాయి. ఈ మేరకు హిందూస్థాన్ యునిలివర్ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో జనం సతమతమవుతుండగా.. ఇప్పుడు మరో బండ పడినట్లయింది.

Price Hike: సామాన్యులపై మరో పిడుగు.. భారీగా పెరిగిన సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ధరలు.. ఒకేసారి బాదుడు..
Prices Hike

Updated on: Nov 10, 2026 | 4:22 PM

దేశంలో ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఎల్‌నివో ప్రభావంతో పాలు, పంచదార, వంట నూనెలు, బియ్యం, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోంది. ఈ క్రమంలో దేశంలోని సామాన్యులపై మరో పిడుగు పడింది. అదేంటంటే.. సామాన్యులు తమ ఇంట్లో తరచూ ఉపయోగించే సబ్బులు, డిటర్జెంట్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ మేరకు ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందూస్థాన్ యునిలివర్ సంస్థ డిటర్జెంట్ ధరలతో పాటు అనేక ఉత్పత్తుల ధరలను పెంచింది. దాదాపు ధరలను 11 శాతం వరకు పెంచింది. ఇప్పటికే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

సర్ఫ్‌ ఎక్సెల్ కొత్త ధరలు

సర్ప్ ఎక్సెల్, రిన్, వీల్ వంటి డిటర్జెంట్ల ధరలు పెరిగాయి. వివిధ సైజుల ప్యాకెట్లను బట్టి ధరల పెంపు రూ.1 నుంచి రూ.10 వరకు ఉంది. సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ కేజీ ప్యాకెట్ ధర రూ.10 పెరిగింది. దీంతో దీని ధర రూ.235 నుంచి రూ.245కి చేరుకుంది. ఇక 500 గ్రాముల ప్యాకెట్ ధర రూ.5 పెరిగింది. సర్ప్ ఎక్సెల్ ఈజీ వాస్ కేజీ ప్యాకెట్ ధర రూ.5 పెంచడంతో దీని ధర రూ.172కి చేరుకుంది. సర్ప్ ఎక్సెల్ ఈజీ వాష్ 500 గ్రాములు ప్యాక్ ధర రూ.85 నుంచి రూ.87కి పెంచారు. 250 గ్రాముల సర్ప్ ఎక్సెల్ బార్ రూ.3 పెంచడంతో రూ.45కి పెరిగింది. 200 గ్రాముల నాలుగు బార్ల ధర రూ.10 మేర పెంచడంతో.. రూ.155కి పెరిగాయి.

రిన్, వీల్ ధరలు ఇవే..

-రిన్ అలా 500 ఎంఎల్ ధర రూ.5 పెంచడంతో రూ.95కి చేరుకుంది

-1 కేజీ రిన్ డిటర్జెంట్ పౌడర్ ధర రూ.3 పెంచడంతో రూ. 93కి చేరుకుంది

-500 గ్రాముల రిన్ డిటర్జెంట్ ధర రూ.2 పెంచడంతో రూ.47కి చేరుకుంది

-మోతీ గులాబ్ సబ్బు ధర రూ.74 నుంచి రూ.82కి పెంచింది. అంటే రూ.8 ఒకేసారి పెంచింది

ధర పెంపునకు కారణాలు..

ముడి సరుకుల ధరలు పెరగడంతో సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచాల్సి వచ్చిందని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) సీఈవో ప్రియా నాయర్ వెల్లడించారు. ఖర్చులు పెరగడం వల్ల తమ లాభాలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో సబ్బులు, డిటర్జెంట్ల తయారీలో హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అగ్రగామి సంస్థగా ఉంది. ఈ కంపెనీ పెంచడంతో  రాబోయే రోజుల్లో ఇతర కంపెనీలు కూడా సబ్బులు, డిటర్జెంట్ ధరలను పెంచే అవకాశముందని తెలుస్తోంది. దీంతో సామాన్యులపై మరో ధరల బండ పడనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us