డబ్బు, తెలివి మాత్రమే కాదు.. వారెన్ బఫెట్ చెప్పిన ఈ సీక్రెట్ తెలిస్తే విజయం పక్కా..

డబ్బు, హోదా, పలుకుబడి ఉన్నంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాలేరు. మన ఆలోచనా విధానం, ప్రవర్తన, మనం ఎంచుకునే స్నేహితులు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కొందరితో స్నేహం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచితే.. మరికొందరితో సావాసం మన లక్ష్యాలనే దూరం చేయొచ్చు. మరి ప్రపంచ కుబేరుడు, ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ ప్రకారం యువత సక్సెస్ కావాలంటే ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి? ఎవరికి దూరంగా ఉండాలి? అనేవి తెలుసుకుందాం..

డబ్బు, తెలివి మాత్రమే కాదు.. వారెన్ బఫెట్ చెప్పిన ఈ సీక్రెట్ తెలిస్తే విజయం పక్కా..
Warren Buffett Advice On Success And Character
Image Credit source: AI Image

Updated on: Nov 14, 2026 | 3:44 PM

మనిషి జీవితంలో స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువ. మన ఆలోచనలు, అలవాట్లు, నిర్ణయాలు.. ఇలా ఎన్నో విషయాలపై మన చుట్టూ ఉండే వ్యక్తుల ప్రభావం ఉంటుంది. అందుకే మంచి స్నేహితులను ఎంచుకోవడం కూడా జీవితంలో ఎదగడానికి ముఖ్యమైన అంశమని చెబుతుంటారు. ఇదే విషయాన్ని ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారు, బిలియనీర్ వారెన్ బఫెట్ కూడా పదేపదే ప్రస్తావించారు. ముఖ్యంగా యువతకు ఆయన ఇచ్చిన ఒక సలహా ఇప్పుడు కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మనకంటే మంచి లక్షణాలు ఉన్న వ్యక్తులతో స్నేహం చేయాలని, వారి నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. 2004లో బెర్క్‌షైర్ హాత్‌వే వార్షిక సమావేశంలో ఓ 14 ఏళ్ల బాలుడు బఫెట్‌ను ఒక ప్రశ్న అడిగాడు. జీవితంలో విజయం సాధించాలంటే యువత ఎలాంటి విషయాలను అనుసరించాలి? అని ప్రశ్నించాడు. దీనికి బఫెట్ ఇచ్చిన సమాధానం ఎంతో ఆసక్తికరంగా ఉంది. మనకంటే మెరుగైన ప్రవర్తన, మంచి లక్షణాలు ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం గడపాలని సూచించారు. అలాంటి వ్యక్తులతో కలిసి ఉంటే క్రమంగా వారి మంచి లక్షణాలు మనలోనూ అలవడతాయని వివరించారు.

చెడు వ్యక్తులతో తిరిగితే..

అదే సమయంలో చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా తిరిగితే మన ప్రవర్తన కూడా క్రమంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఎలాంటి వ్యక్తులతో ఎక్కువ సమయం గడుపుతున్నాం? అనే విషయాలు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

నచ్చిన వ్యక్తుల్లోని మంచి లక్షణాలను అలవర్చుకోవాలి..

బఫెట్ సూచన ప్రకారం.. మనకు నచ్చిన వ్యక్తులను ఒకసారి పరిశీలించాలి. వారిలో మనల్ని ఆకర్షించే లక్షణాలు ఏమిటి? వారి ప్రవర్తనలో మనం మెచ్చుకునే విషయాలు ఏంటి? అనే అంశాలను గుర్తించాలి. ఆ మంచి లక్షణాలను మన జీవితంలోనూ అలవర్చుకునే ప్రయత్నం చేయాలి. అదే విధంగా ఇతరుల్లో మనకు నచ్చని లక్షణాలు మనలో కూడా ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. ఉంటే వాటిని మార్చుకోవాలి. నిజాయతీ, క్రమశిక్షణ, ఇతరులను గౌరవించడం, బాధ్యతగా వ్యవహరించడం వంటి లక్షణాలు మంచి వ్యక్తిత్వానికి పునాదులు. కేవలం సంపద, హోదా ఉన్నవారిని చూసి వారిని అనుసరించడం కాకుండా.. వారి ప్రవర్తన, విలువలు, ఆలోచనా విధానాన్ని గమనించాలని బఫెట్ సలహా సూచిస్తుంది.

స్నేహితుల ఎంపిక జీవితాన్నే మార్చేస్తుంది..

2025 మే 3న జరిగిన బెర్క్‌షైర్ హాత్‌వే వార్షిక సమావేశంలోనూ బఫెట్ ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. మనం ఎవరితో కలిసి పనిచేస్తున్నాం..? ఎవరిని అభిమానిస్తున్నాం..? ఎవరితో స్నేహం చేస్తున్నాం..? అనే అంశాలు మన జీవిత గమనాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. మనల్ని మనం మరింత మెరుగుపరుచుకోవాలనే ఆలోచన కలిగించే వ్యక్తులతో కలిసి ఉండాలని సూచించారు.

మంచి వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల వ్యాపారంలోనే కాకుండా జీవితంలోనూ విజయవంతం కావడానికి అవసరమైన విషయాలను నేర్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతరుల నుంచి మనం మంచి విషయాలు నేర్చుకోవడమే కాకుండా మనం కూడా వారికి మంచి విలువలను అందించాలి. ఇలా ఒకరికొకరు మంచి అలవాట్లను పంచుకుంటే ఆ ప్రభావం మరింత పెరుగుతుందని వివరించారు.

విజయానికి డబ్బు ఒక్కటే కొలమానం కాదు..

బఫెట్ చెప్పిన ఈ మాటల్లో ఒక ముఖ్యమైన జీవిత పాఠం దాగి ఉంది. విజయం సాధించాలంటే కేవలం తెలివితేటలు, కష్టపడి పనిచేయడం మాత్రమే సరిపోదు. మన చుట్టూ ఉండే వ్యక్తులు, వారి ఆలోచనలు, అలవాట్లు కూడా మన ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే స్నేహితులను ఎంచుకునేటప్పుడు వారి దగ్గర ఎంత డబ్బు ఉంది? ఎంత పేరు ఉంది? అనే దానికంటే వారి వ్యక్తిత్వం ఎలా ఉంది? వారి నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? అనే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనల్ని మంచి వ్యక్తిగా మార్చే స్నేహాలే నిజమైన సంపద అనే బఫెట్ సూచన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.

Loading...
Unable to load recommendations.
Follow Us