డీమార్ట్‌‌తో బిజినెస్ డీల్.. మీ వస్తువులను అమ్మి లక్షలు సంపాదించడం ఎలాగో తెలుసా..?

D Mart: డీమార్ట్ అంటే అందరికీ గుర్తొచ్చేది తక్కువ ధరలు, భారీ ఆఫర్లు, నెలకు సరిపడా సరుకులు కొనడం మాత్రమే.. కానీ చాలామందికి తెలియని అసలు విషయం ఏంటంటే.. డీమార్ట్‌లో కేవలం సరుకులు కొనడమే కాదు మీరు తయారుచేసిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా అమ్ముకోవచ్చు కూడా. చిన్న వ్యాపారులను లక్షాధికారులుగా మార్చే ఈ బిజినెస్ సీక్రెట్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

డీమార్ట్‌‌తో బిజినెస్ డీల్.. మీ వస్తువులను అమ్మి లక్షలు సంపాదించడం ఎలాగో తెలుసా..?
How To Sell Your Products In D Mart

Updated on: Oct 03, 2026 | 6:39 PM

సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి ఉత్పత్తులను తయారుచేసే ప్రతి ఒక్కరికీ తమ సరుకు పెద్ద ఎత్తున అమ్ముడుపోవాలనే కల ఉంటుంది. గ్రామాల్లో లేదా చిన్న పట్టణాల్లో సొంతంగా ఆహార ఉత్పత్తులు, నిత్యావసరాలు, గృహోపకరణాలు తయారుచేసే చిన్న సంస్థలు ఎన్నో ఉన్నాయి. అయితే వీరందరికీ ఎదురయ్యే ప్రధాన సమస్య మార్కెటింగ్. కేవలం చుట్టుపక్కల దుకాణాలకు పరిమితమైతే వ్యాపారంలో పెద్దగా ఎదుగుదల ఉండదు. అదే దేశవ్యాప్తంగా వందలాది స్టోర్లు ఉన్న డీమార్ట్ వంటి రిటైల్ దిగ్గజంలో మీ సరుకు కొలువుదీరితే? అమ్మకాలు ఊహించని రీతిలో పెరిగిపోతాయి. డీమార్ట్ స్టోర్ నడపడానికి ఎవరికీ ఫ్రాంచైజీలు ఇవ్వదు. కానీ, చిన్న తయారీదారులను వెండార్లుగా చేర్చుకునేందుకు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుంది.

డీమార్ట్ షెల్ఫ్‌లపైకి చేరాలంటే ఏం కావాలి?

డీమార్ట్ కస్టమర్లు నాణ్యతతో పాటు చౌక ధరలను ఆశిస్తారు. అందుకే స్టోర్‌లో మీ ప్రొడక్ట్ పెట్టాలంటే ఈ మూడు అంశాలు కీలకం..

ధర – నాణ్యత సమతుల్యత: బ్రాండెడ్ ఉత్పత్తులకు సమానమైన నాణ్యత ఉంటూనే, ధర సామాన్యులకు అందుబాటులో ఉండాలి.

ఆకర్షణీయమైన ప్యాకింగ్: రవాణాలో పాడవకుండా ఉండేలా, అలాగే వినియోగదారులను చూడగానే ఆకట్టుకునేలా ప్యాకేజింగ్ ప్రమాణాలు పాటించాలి.

స్థిరమైన ప్రొడక్షన్ కెపాసిటీ: ఒక్కసారి డీమార్ట్‌లోకి వెళ్లాక వేల సంఖ్యలో ఆర్డర్లు వస్తాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా రోజువారీగా సరుకును సరఫరా చేసే మ్యానుఫ్యాక్చరింగ్ సత్తా ఉండాలి.

వ్యాపారానికి ఉండాల్సిన కీలక పత్రాలు..

  • జీఎస్టీ, వ్యాపార పాన్ నంబర్.
  • పచ్చళ్లు, అప్పడాలు, పొడులు, పిండి పదార్థాలు వంటి ఆహార ఉత్పత్తులైతే భారత ఆహార భద్రత ప్రామాణిక సంస్థ ధ్రువీకరణ పత్రం.
  • ఇతర ఉపకరణాలకైతే ప్రభుత్వ సంబంధిత టెస్టింగ్ లేదా BIS ధ్రువీకరణలు.
  • చిన్న తరహా పరిశ్రమ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్యామ్ సర్టిఫికెట్ ఉంటే అదనపు ప్రయోజనం లభిస్తుంది.

డీమార్ట్‌తో వ్యాపారం లాభదాయకమేనా?

డీమార్ట్‌లో ప్రతి వస్తువుపైనా వచ్చే మార్జిన్ కంటే భారీ సంఖ్యలో జరిగే అమ్మకాలే అసలైన లాభాన్ని తెచ్చిపెడతాయి. నెలకు కొన్ని వందల ప్యాకెట్లు అమ్ముకునే చిన్న యూనిట్లు.. డీమార్ట్ ద్వారా ఏకంగా వేలాది యూనిట్లను విక్రయించే స్థాయికి చేరుకుంటాయి. దీనివల్ల వ్యాపారం తక్కువ సమయంలోనే బ్రాండ్‌గా మారుతుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

సంస్థ అధికారిక వెబ్‌సైట్ (dmartindia.com) సందర్శించి Partner With Us విభాగం ద్వారా మీ తయారీ విభాగం, ఉత్పత్తుల కేటలాగ్ వివరాలను సమర్పించవచ్చు. ఆమోదం లభిస్తే మీ ప్రొడక్ట్ శాంపిల్స్ పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు సరిపోలితే సరఫరా ఒప్పందం కుదుర్చుకుంటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us