Credit Score: సిబిల్ స్కోర్‌తో పనిలేదు.. ఇలా చేస్తే ఈజీగా లోన్.. ఎవరూ చెప్పని సీక్రెట్స్ ఇవే..

ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు వస్తాయో ఎవరూ ఊహించలేరు. అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకులు సిబిల్ స్కోరు తక్కువగా ఉందని లోన్ నిరాకరిస్తే ఆ బాధ వర్ణనాతీతం. అయితే క్రెడిట్ స్కోరు లేకపోతే లోన్ రాదు అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. స్కోరుతో సంబంధం లేకుండా మీరు సులభంగా రుణం పొందే మార్గాలు మన కళ్లముందే ఉన్నాయి. అవేటంటే..?

Credit Score: సిబిల్ స్కోర్‌తో పనిలేదు.. ఇలా చేస్తే ఈజీగా లోన్.. ఎవరూ చెప్పని సీక్రెట్స్ ఇవే..
How To Get A Loan Without Cibil Score

Updated on: Mar 09, 2026 | 7:16 PM

బ్యాంకు రుణాల విషయంలో క్రెడిట్ స్కోరు అనేది చాలా కీలకం. ఈ స్కోరు బాగుంటేనే రుణం మంజూరవుతుంది. కానీ అందరికీ మెరుగైన స్కోరు ఉండాలని లేదు. మరి అలాంటప్పుడు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం ఎలా? సిబిల్ చెకింగ్ లేకుండానే తక్షణ రుణం పొందేందుకు బంగారు రుణాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, ఆస్తి హామీ వంటి అనేక మార్గాలను బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు అందిస్తున్నాయి. క్రెడిట్ హిస్టరీ లేకపోయినా మీరు ఆర్థికంగా ఎలా ముందడుగు వేయవచ్చో అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

గోల్డ్ లోన్: తక్షణ పరిష్కారం

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం బంగారు రుణం. మీ దగ్గర ఉన్న బంగారాన్ని పూచీకత్తుగా పెట్టి క్రెడిట్ స్కోరుతో సంబంధం లేకుండా లోన్ పొందవచ్చు. వడ్డీ రేటు సుమారు 8.50శాతం నుండి ప్రారంభం అవుతుంది. నిమిషాల్లో లోన్ మంజూరవుతుంది, ఇతర డాక్యుమెంట్ల అవసరం తక్కువ.

హామీదారుడి సాయం

మీకు క్రెడిట్ స్కోరు లేకపోయినా, మంచి స్కోరు ఉన్న మీ కుటుంబ సభ్యుడిని లేదా స్నేహితుడిని షూరిటీగా ఉంచవచ్చు. వారి క్రెడిట్ చరిత్ర ఆధారంగా బ్యాంకులు మీకు పర్సనల్ లేదా ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాయి. అయితే ఒకవేళ మీరు చెల్లించకపోతే ఆ ప్రభావం హామీదారుడిపై పడుతుందని గుర్తుంచుకోవాలి.

ఇన్సూరెన్స్ పాలసీపై రుణం

మీరు కనీసం మూడు ఏళ్లుగా ఎల్‌ఐసి వంటి జీవిత బీమా పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే ఆ పాలసీ డాక్యుమెంట్‌ను తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు. వడ్డీ రేటు వార్షికంగా 9-10శాతం వరకు ఉంటుంది. దీనికి సిబిల్ స్కోరుతో సంబంధం ఉండదు. కేవలం మీ పాలసీ సరెండర్ వాల్యూ ఆధారంగా లోన్ ఇస్తారు.

ఆస్తిపై రుణం

మీ పేరు మీద నివాస గృహం లేదా వాణిజ్య స్థలం ఉంటే దానిపై లోన్ పొందవచ్చు. దీన్ని లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ అంటారు. తక్కువ వడ్డీ రేటు, ఎక్కువ కాలపరిమితితో ఈ రుణం లభిస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఇది మంచి ఎంపిక.

పొదుపు ఖాతాపై ఓవర్‌డ్రాఫ్ట్

మీరు ఒక బ్యాంకులో ఎక్కువ కాలంగా సేవింగ్స్ అకౌంట్ వాడుతున్నట్లయితే, బ్యాంకులు మీకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. అంటే మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ కంటే ఎక్కువ డబ్బును నిర్ణీత పరిమితి వరకు తీసుకోవచ్చు. ఇది బ్యాంకుతో మీకు ఉన్న లావాదేవీల బంధంపై ఆధారపడి ఉంటుంది.

అద్దె డిపాజిట్ రుణాలు

మెట్రో నగరాల్లో ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు 6 నుండి 10 నెలల డిపాజిట్ భారంగా మారుతుంది. దీని కోసం ఇప్పుడు Magicbricks వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొన్ని సంస్థలు ప్రత్యేకంగా రెంటల్ డిపాజిట్ లోన్ ఇస్తున్నాయి. దీనికి క్రెడిట్ స్కోరు కంటే మీ ఆదాయం ముఖ్యం.

సిబిల్ స్కోరు లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఏదో ఒక పూచీకత్తు ద్వారా మీరు ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. అయితే ఈ రుణాలు తీసుకున్న తర్వాత సకాలంలో ఈఎంఐలుచెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోరును భవిష్యత్తు కోసం మెరుగుపరుచుకోవచ్చు.

Follow Us