
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వాషింగ్ మెషీన్ అనేది విలాసం కోసం కాదు.. ఒక నిత్యావసర వస్తువు. కొత్తగా మెషీన్ కొనేటప్పుడు మనం దాని రంగు, కెపాసిటీ, బ్రాండ్ వంటి అంశాలపై చూపే శ్రద్ధ.. దాని వల్ల వచ్చే నెలవారీ విద్యుత్ బిల్లుపై చూపం. మెషీన్ ఇంటికి వచ్చి, వాడకం మొదలయ్యాక వచ్చే కరెంట్ బిల్లు చూసి చాలామంది ఆందోళన చెందుతుంటారు. అసలు ఒక సాధారణ 7 కేజీల వాషింగ్ మెషీన్ ఒకసారి వాడితే ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది? ఏయే మోడ్స్ వాడితే బిల్లు తక్కువ వస్తుంది? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ విజయ్ సేల్స్ అందించిన గణాంకాల ప్రకారం.. ఒక ప్రామాణికమైన 7 కేజీల వాషింగ్ మెషీన్ సాధారణంగా ఒక వాష్ సైకిల్‌కు సుమారు 0.25 నుండి 0.35 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. మీ ప్రాంతంలో విద్యుత్ యూనిట్ ధర రూ.7 అనుకుంటే 0.25 యూనిట్ల వినియోగం జరిగితే రూ.1.75 మాత్రమే ఖర్చవుతుంది. 0.35 యూనిట్ల వినియోగం జరిగితే రూ.2.45ఖర్చవుతుంది. సమయం పరంగా చూస్తే.. ఒక గంట పాటు మెషీన్ రన్ అయితే సగటున 0.2 నుండి 0.4 యూనిట్ల వరకు కరెంట్ వినియోగం జరుగుతుంది. దీనిని బట్టి చూస్తే మీరు నెలకు 30 రోజులు రోజుకోసారి మెషీన్ వాడినా కరెంట్ బిల్లులో దీని వాటా రూ.60 నుండి రూ.80 మించదు. కానీ ఇది కేవలం నార్మల్ వాష్‌కు మాత్రమే వర్తిస్తుంది.
మెషీన్ బిల్లు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అందులో ఉండే హీటింగ్ ఫంక్షన్, డ్రైయర్ సెట్టింగ్స్. చాలామంది బట్టలు శుభ్రంగా రావాలని లేదా మొండి మరకలు పోవాలని వేడి నీటి ఆప్షన్‌ను ఎంచుకుంటారు. మీరు నీటిని వేడి చేసి బట్టలు ఉతికితే, కరెంట్ వినియోగం ఒక్కో వాష్‌కు 1 నుండి 2 యూనిట్ల వరకు పెరుగుతుంది. అంటే సాధారణ వాష్‌తో పోలిస్తే వేడి నీటి వాడకం వల్ల బిల్లు దాదాపు 4 నుండి 5 రెట్లు పెరిగే అవకాశం ఉంది.
మీ వాషింగ్ మెషీన్‌లో ఉండే కొన్ని ఫీచర్లను తెలివిగా వాడటం ద్వారా బిల్లును గణనీయంగా తగ్గించవచ్చు..
క్విక్ వాష్ : తక్కువ మురికి ఉన్న బట్టలకు లేదా రోజూ వేసుకునే బట్టలకు ఈ మోడ్ సరైనది. ఇది తక్కువ సమయంలో వాష్ పూర్తి చేసి విద్యుత్‌ను ఆదా చేస్తుంది.
ఎకో మోడ్ : చాలా ఆధునిక మెషీన్లలో ఈ ఆప్షన్ ఉంటుంది. ఇది నీటిని, విద్యుత్తును అత్యంత పొదుపుగా వాడుకుంటూ బట్టలను శుభ్రం చేస్తుంది.
కోల్డ్ వాష్ : మురికి మరీ ఎక్కువగా లేకపోతే ఎప్పుడూ చల్లటి నీటితోనే ఉతకండి. దీనివల్ల మెషీన్‌లోని హీటర్ పని చేయదు, ఫలితంగా బిల్లు తక్కువ
వస్తుంది.
లోడ్ మేనేజ్‌మెంట్: మెషీన్ కెపాసిటీ నిండుగా ఉన్నప్పుడే వాష్ చేయడం మంచిది. ఒకటి రెండు బట్టల కోసం మెషీన్ రన్ చేస్తే విద్యుత్ వృధా అవుతుంది.
వాషింగ్ మెషీన్ అనేది కరెంట్ తాగేసే భూతం ఏమీ కాదు. మనం దాన్ని ఎలా వాడుతున్నామనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అనవసరంగా హీటర్ వాడకాన్ని తగ్గించి, ఎకో లేదా క్విక్ వాష్ మోడ్స్‌ను ఎంచుకుంటే, మీ కరెంట్ బిల్లు మీ అదుపులోనే ఉంటుంది. స్మార్ట్‌గా వాడండి.. పొదుపుగా జీవించండి..