
చాలామంది అవసరం లేకపోయినా లేదా బ్యాంకులు ఇస్తున్నాయని ఒకటికి రెండు క్రెడిట్ కార్డులు తీసుకుంటుంటారు. అయితే కాలక్రమేణా వాటిని వాడకపోవడం వల్ల.. ఇక ఈ కార్డుతో పనేముందిలే అని క్లోజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. కానీ తొందరపడి పాత క్రెడిట్ కార్డును క్లోజ్ చేస్తే మీ సిబిల్ స్కోర్ పడిపోవడమే కాకుండా భవిష్యత్తులో రుణాలు పొందడం కూడా కష్టమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు ఖాతాను క్లోజ్ చేయడానికి, క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడానికి చాలా తేడా ఉంది. బ్యాంకు ఖాతాను మూసివేస్తే సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం పడదు. కానీ క్రెడిట్ కార్డును బంద్ చేస్తే మాత్రం మీ క్రెడిట్ ప్రొఫైల్ దెబ్బతింటుంది.
మన సిబిల్ స్కోర్ అనేది సకాలంలో బిల్లులు చెల్లించడం, మొత్తం అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్.. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో, క్రెడిట్ హిస్టరీ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్‌బజార్ సీఈఓ అధిల్ శెట్టి ప్రకారం.. పాత క్రెడిట్ కార్డును రద్దు చేసినప్పుడు మనకు అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. దీనివల్ల మన క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది బ్యాంకు దృష్టిలో ప్రతికూల సంకేతం. మీ దగ్గర ఉన్న అన్ని క్రెడిట్ కార్డుల మొత్తం లిమిట్ రూ.3 లక్షలు అనుకుందాం. అందులో మీరు రూ.60,000 వాడారు. అంటే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 20శాతం ఉంటుంది. ఇప్పుడు మీరు రూ.1లక్ష లిమిట్ ఉన్న ఒక కార్డును క్లోజ్ చేస్తే, మీ మొత్తం లిమిట్ రూ.2 లక్షలకు పడిపోతుంది. కానీ మీ వాడకం రూ.60,000 అలాగే ఉంది. అప్పుడు మీ యుటిలైజేషన్ రేషియో 30శాతానికి పెరుగుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌ను నేరుగా తగ్గిస్తుంది.
ఎన్నో ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డ్ మీ క్రెడిట్ హిస్టరీని బలోపేతం చేస్తుంది. సుదీర్ఘకాలం పాటు క్రెడిట్ కార్డును సక్రమంగా ఉపయోగించారని చెప్పడానికి ఇది నిదర్శనం. ఆ పాత కార్డును క్లోజ్ చేయడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ కాలపరిమితి తగ్గిపోతుంది. ఒకవేళ ఆ పాత క్రెడిట్ కార్డుపై ఎటువంటి యాన్యువల్ ఫీజు లేకపోతే, దాన్ని క్లోజ్ చేయకుండా ఉండటమే మంచిది. ప్రతినెల లేదా కొన్ని రోజులకు ఒకసారి చిన్న చిన్న షాపింగ్‌లు చేస్తూ ఆ కార్డును యాక్టివ్‌గా ఉంచడం మంచిది.
సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌ను క్లోజ్ చేయడం వల్ల సిబిల్ స్కోర్‌పై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే ఈ అకౌంట్ల సమాచారం సిబిల్ బ్యూరోకి వెళ్లదు. అయితే మీరు మూసివేసే బ్యాంకు ఖాతాకు హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లుల ఆటో డెబిట్ లింక్ అయి ఉంటే.. ఆ ఖాతా క్లోజ్ చేసే ముందే మీ ఆటో-డెబిట్ ఆప్షన్‌ను వేరే బ్యాంక్ ఖాతాకు మార్చుకోవాలి. లేదంటే సమయానికి ఈఎంఐలు కట్ కాక చెల్లింపులు ఆలస్యమయ్యాయి అని రికార్డ్ అవుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌ను దారుణంగా దెబ్బతీస్తుంది.
మంచి సిబిల్ స్కోర్ కోసం ఇన్ని కార్డులు మాత్రమే ఉండాలనే నియమమేదీ లేదు. మీరు ఎన్ని కార్డులైనా కలిగి ఉండవచ్చు.. కానీ అన్నింటినీ సక్రమంగా మెయింటెన్ చేస్తూ, బిల్లులను సమయానికి చెల్లిస్తూ, లిమిట్‌ను పరిమితి దాటకుండా వాడుకోవడం చాలా ముఖ్యం. కార్డును క్లోజ్ చేసే ముందు పాత బాకీలన్నీ పూర్తిగా చెల్లించడం, ఆటో డెబిట్ వివరాలను అప్‌డేట్ చేయడం, బ్యాంకు రికార్డులను చెక్ చేసుకోవడం మర్చిపోకండి.