
అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే నిధిని ఎక్కడ ఉంచాలి అన్నది కేవలం రాబడులపై ఆధారపడదు. అవసరమైన సమయంలో ఆ డబ్బు ఎంత త్వరగా అందుబాటులోకి వస్తుందన్నదే అసలు కీలకం. అందుకే ఆర్థిక నిపుణులు లిక్విడిటీని అత్యంత ముఖ్యమైన అంశంగా సూచిస్తున్నారు. అత్యవసర నిధి అనేది అనుకోని ఖర్చులు.. ఉదాహరణకు వైద్య చికిత్సలు, ఉద్యోగం కోల్పోవడం లేదా వాహనం మరమ్మతులు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉంచే రక్షణ కవచంలాంటిది. ఇది మీకు అప్పు చేయాల్సిన అవసరాన్ని తగ్గించి, మీ దీర్ఘకాలిక పెట్టుబడులను కాపాడుతుంది.
ఈ అంశంపై నిపుణుడు అవినాష్ లుథ్రియా అభిప్రాయం ప్రకారం.. అత్యవసర పరిస్థితి స్వభావాన్ని బట్టి పెట్టుబడి ఎంపిక మారాలి. ఉదాహరణకు వెంటనే డబ్బు అవసరమయ్యే పరిస్థితుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఒక ప్రాక్టికల్ ఆప్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే FDలను బ్రేక్ చేసి తక్షణమే డబ్బు పొందవచ్చు. చాలా మంది పొదుపు ఖాతాల్లో పెద్ద మొత్తాన్ని ఉంచకపోవడంతో, అటువంటి సమయంలో FDలు ఉపయోగపడతాయి. ఇక మూచ్యువల్ ఫండ్స్‌ల విషయానికి వస్తే, ఇవి పూర్తిగా అత్యవసర పరిస్థితులకు సరిపోవు. డబ్బు విత్‌డ్రా చేసిన తర్వాత ఖాతాలో జమ కావడానికి 2-3 పనిదినాలు పట్టే అవకాశం ఉంది. అయితే 2-3 రోజులు సమయం ఉన్న పరిస్థితుల్లో లిక్విడ్ ఫండ్‌లు లేదా ఓవర్‌నైట్ ఫండ్‌లు ఉపయోగకరంగా ఉండవచ్చు. ఇవి మంచి లిక్విడిటీతో పాటు కొంత రాబడిని కూడా అందిస్తాయి.
పన్నుల విషయానికి వస్తే అత్యవసర నిధి ఎంపికలో అది ప్రాథమిక ప్రమాణం కాకూడదు. ఎందుకంటే అత్యవసర సమయంలో ముఖ్యమైనది డబ్బు త్వరగా లభించడమే. తక్కువ పన్ను శ్రేణిలో ఉన్నవారికి FDలు సరళమైన, సురక్షితమైన ఎంపికగా ఉంటాయి. అయితే అధిక పన్ను శ్రేణిలో ఉన్నవారు డెట్ మ్యూచువల్ ఫండ్‌లను పరిశీలించవచ్చు, ఎందుకంటే ఇవి పన్ను తర్వాత కొంత మెరుగైన రాబడిని ఇవ్వగలవు. మొత్తంగా చూస్తే అత్యవసర నిధిని ఒకే చోట ఉంచడం కంటే, కొంత భాగాన్ని పొదుపు ఖాతా లేదా FDలో, మిగిలిన భాగాన్ని లిక్విడ్ ఫండ్‌లలో ఉంచడం ఉత్తమ వ్యూహంగా భావించవచ్చు. దీంతో అవసరమైనప్పుడు తక్షణ డబ్బు అందుబాటులో ఉండటంతో పాటు, కొంత రాబడి కూడా పొందే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి