
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫాస్టాగ్‌కు సంబంధించి వాహనదారులకు ఊరట కలిగించేలా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలోని కోట్లాది మంది వాహనదారులు ఫాస్టాగ్ ఉపయోగిస్తున్నారు. జాతీయ రహదారులపై వెళ్లే సమయంలో టోల్ ప్లాజా దగ్గర డిజిటల్ విధానంలో టోల్ చెల్లించేందుకు ఇది సహాయపడుతుంది. వాహనంపై ఉండే ఫాస్టాగ్ స్టిక్కర్ స్కాన్ చేయడం ద్వారా టోల్ రుసుం ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. కాలక్రమేణా ఫాస్టాగ్‌లో అనేక మార్పులు తీసుకొస్తున్న కేంద్రం.. తాజాగా కొత్త మార్పు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఒక బ్యాంకులో ఫాస్టాగ్ తీసుకుంటే.. ఆ తర్వాత వేరే బ్యాంకుకు మార్చుకోవాలంటే పాత ఫాస్టాగ్ స్టిక్కర్ తీసేసి కొత్త బ్యాంక్‌ది వాహనంపై అంతికించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కేంద్రం రూల్స్‌లో మార్పులు చేసింది.
ఇక నుంచి ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ద్వారానే వేరే బ్యాంకుకు మారవచ్చు. ఇందుకోసం ఫాస్టాగ్ పోర్టబులిటీ అనే సేవలను కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఫాస్టాగ్ వన్ అనే పోర్టబులిటీ విధానాన్ని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2026 సమావేశంలో దీనిని ప్రారంభించారు. దీని ద్వారా మరో బ్యాంక్‌కు ఫాస్టాగ్ మార్చుకోవాలంటే పాత ఖాతాను క్లోజ్ చేయాల్సిన పని లేదు. వాహనదారుడి ట్యాగ్ ఐడీ, వెహికల్ రిజిస్ట్రేన్ నెంబర్, స్టిక్కర్ పాతవే కొనసాగుతాయి. దీని వల్ల పాత స్టిక్కర్‌ను మార్చుకోవాల్సిన పనే లేదు. అదే స్టిక్కర్‌పై వేరే బ్యాంకుకు మారవచ్చు. నేషనల్ పేమెంట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుంబంధ సంస్థ అయిన IHMCL, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఈ కొత్త సర్వీసును అభివృద్ది చేశాయి.
ముందుగా మీరు రాజ్ మార్గ్ యాత్ర యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి. ఆ యాప్‌లో అర్హత చెకింగ్, వెరిఫికేషన్ ప్రక్రియ, పర్మిషన్ తర్వాత మీకు నచ్చిన బ్యాంకును ఎంచుకోండి. అనంతరం కొత్త బ్యాంకుకు మీ ఫాస్టాగ్ సేవలు మారిపోతాయి. పాత ఫాస్టాగ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్, పెండింగ్ లావాదేవీలు, ఖాతా క్లోజర్ వంటివి మునపటి బ్యాంక్ చూసుకుంటుంది. ఫాస్టాగ్ బ్యాంక్ సర్వీసులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమస్యలను తొలగించేందుకు కేంద్రం ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీని వల్ల పదే పదే ఫాస్టాగ్ స్టిక్కర్ మార్చుకోవాల్సిన పని ఉండదు. ఒక్క స్టిక్కర్‌పైనే ఎన్ని బ్యాంకులు అయినా మారవచ్చు. ఫాస్టాగ్ సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.