
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) త్వరలో వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు వాట్సప్ ద్వారా ఈపీఎఫ్‌వో సేవలను సులువుగా పొందవచ్చు. ఇప్పటివరకు పీఎఫ్ సేవల కోసం వాట్సప్ సేవలు అందుబాటులో లేవు. ఇందుకోసం యూఏఎన్ వెబ్ సైట్ లేదా ఉమాంగ్ యాప్‌ను ఉపయోగించాల్సి వస్తోంది. అయితే త్వరలో రానున్న ఫీచర్ ద్వారా వాట్సప్ ద్వారానే పీఎఫ్ చందాదారులు సులువుగా సేవలు పొందవచ్చు. సేవలను సులభతరంగా పొందేందుకు, సందేహాలకు సమాధానాలు పొందేందుకు వాట్సప్ ఆధారిత ఏఐ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. దీనిని ఎలా ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.
ఈపీఎఫ్‌వో త్వరలో ఒక నెంబర్ ప్రవేశపెట్టనుంది. యూఏఎన్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నుంచి ఈ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేయాలి. అనంతరం అక్కడ సర్వీసెస్‌లో వివిధ ఆప్షన్లు ఉంటాయి. బ్యాలెన్స్ చెకింగ్, పీఎఫ్ క్లెయిమ్ విత్ డ్రా స్టేటస్, కేవైసీ అప్డేట్ వివరాలు, ఫిర్యాదులు వంటి ఆప్షన్లు ఉంటాయి. మీకు కావాల్సిన సర్వీసెస్ ఎంచుకుంటే సరిపోతుంది. అలాగే వివిధ భాషల్లో ఈ వాట్సప్ సేవలు ఉంటాయి. దీంతో మీకు కావాల్సిన లాంగ్వేజ్ ఎంచుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్న పీఎఫ్ ఖతాదారులందరూ తమ ప్రాంతీయ భాషల్లో సేవలు పొందేందుకు ఇది వీలు కల్పిస్తోంది.
వాట్సప్ సేవల వల్ల ఏదైనా సమస్య వస్తే ఈపీఎఫ్‌వో కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదు. పీఎఫ్ కార్యాలయాలపై ఒత్తిడి తగ్గించేందుకు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఈ ఫీచర్ ప్రవేశపెట్టారు. ఈ వాట్సప్ సేవలు అందుబాటులోకి వస్తే పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్, గత ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్, పెండింగ్‌లో ఉన్న కంప్లైంట్స్ వంటివి సులువుగా యాక్సెస్ చేయవచ్చు. 24 గంటల పాటు ఈ చాట్ బాట్ అందుబాటులో ఉంటుంది. ఇక ఆధార్ వెరిఫికేషన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ వంటి పనులు పూర్తి చేయాల్సి వస్తే వాట్సప్‌కు నోటిఫికేషన్లు కూడా వస్తాయి.