
ఈపీఎఫ్‌వో ఖాతా గురించి చాలామంది పట్టించుకోవడం మానేస్తుంటారు. కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, ఈ-నామినేషన్ అప్డేట్ చేసుకోవడం లాంటివి చేసుకోరు. ముఖ్యంగా ఈ-నామినేషన్ అప్డేట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ ప్రక్రియ పూర్తి చేసుకోకపోతే ఉద్యోగి మరణించినప్పుడు కుటుంబసభ్యులు లేదా నామినీ క్లెయిమ్ పొందటంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఇందుకోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి ఉంటుంది. ఈ-నామినేషన్ పూర్తి చేయడం వల్ల కుటుంబసభ్యులు క్లెయిమ్ పొందటం సులువవుతుంది. ఆన్‌లైన్ ద్వారా సులువుగా ఖాతాదారులు కుటుంబసభ్యుల వివరాలను అప్డేట్ చేయవచ్చు. అదెలా అనేది చూద్దాం.
ఒకవేళ ఈపీఎఫ్ పరిధిలో ఉన్న ఉద్యోగి మరణిస్తే.. ఆ అకౌంట్లోని బ్యాలెన్స్, పెన్షన్, జీవిత బీమా సొమ్మును కుటుంబసభ్యులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఉద్యోగి సమర్పించే నామినేషన్ వివరాలు కీలకంగా పనిచేస్తాయి. ఉద్యోగి ఎవరి పేర్లను అయితే నామినీ జాబితాలో చేరుస్తారో వారికి సొమ్ము అందిస్తారు. కుటుంబ పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు ఉద్యోగి తప్పనిసరిగా నామినేషన్ సమాచారాన్ని అప్డేట్ చేయాలి. వివాహం, పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది ఉద్యోగులు నామినీ వివరాలను అప్డేట్ చేసుకోరు. ఇలాంటి సమయంలో కుటుంబసభ్యులు క్లెయిమ్ పొందటంలో ఇబ్బందులు పడతారు. ఈ-నామినేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే సులువుగా పూర్తి చేసుకోవచ్చు. జస్ట్ 10 నిమిషాల్లోనే మీరు నామినీలను అప్డేట్ చేయవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ అవకాశం కల్పిస్తోంది. ఈ-నామినేషన్ ప్రక్రియను ఈపీఎఫ్ఓ తప్పనిసరి చేసింది. దీంతో మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
-ముందుగా ఈపీఎప్ఓ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి
-మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి
-హోమ్ పేజీలో మేనేజ్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి
-అనంతరం ఈ-నామినేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
-మీ వ్యక్తిగత సమాచారాన్ని ధృవీకరించుకోవాలి
-కుటుంబసభ్యుల పేరు, డేట్ ఆఫ్ బర్త్, సంబంధం, ఆధార్ నెంబర్, అడ్రస్ వివరాలను అందించాలి
-నామినీ మైనర్ అయితే సంరక్షకుని సమాచారం అందించాలి
-ఒకటి కంటే ఎక్కువమంది నామినీలు ఉంటే ఎవరికి ఎంత వాటా అనేది ఎంచుకోవాలి
-అనంతరం మీ ఆధార్‌తో లింక్ అయి మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి
-అనతరం నామినేషన్ హిస్టరీలోకి వెళ్లి చెక్ చేసుకోవాలి
-ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ ఆధారిత ఇ-సంతకం కూడా చేయాలి. ఇ-సంతకం పూర్తి చేయకపోతే నామినేషన్ అసంపూర్ణంగా పరిగణించబడవచ్చు.