
క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంటుందనే విషయం తెలిసిందే. దీంతో క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు చాలామంది ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటారు. ప్రతీ నెలా ఈఎంఐ రూపంలో డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. ప్రతీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఈఎంఐ సదుపాయం అనేది ఉంటుంది. అయితే కొంతమంది అప్పుల భారం భరించలేక కార్డు శాశ్వతంగా క్లోజ్ చేయాలని అనుకుంటుంటారు. ఇలాంటి సమయంలో ఈఎంఐ ఏమవుతుందనేది అనుమానం చాలామందిలో ఉంటుంది. మీ కార్డుపై ఈఎంఐ ఉంటే క్లోజ్ చేయడం అనేది క్లిష్టంగా మారొచ్చు. కార్డును మూసివేసినంత మాత్రాన ఈఎంఐ అనేది పొదు. ఈఎంఐ అలాగే ఉంటుందనేది మీరు గమనించుకోవాలి.
క్రెడిట్ కార్డును శాశ్వతంగా క్లోజ్ చేసినంత మాత్రాన ఈఎంఐ రద్దు కాదు. మీరు శాశ్వతంగా క్లోజ్ చేయాలంటే బ్యాంకులు మిమ్మల్ని బిల్లు మొత్తం చెల్లించమని అడుగుతాయి. ఇక మిగిలిన ఈఎంఐ విడిగా చెల్లించాల్సిన బకాయిగా మారవచ్చు. ఈఎంఐ ముందుగానే చెల్లిస్తే ఫోర్ క్లోజర్ లేదా ప్రీ క్లోజర్‌గా భావిస్తారు. దీని వల్ల ముందుగానే క్లోజ్ చేయడానికి అదనపు ఛార్జీలు పడతాయి. ఈ ఛార్జీలు బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉంటాయి. దీని వల్ల మీరు చెల్లించాల్సిన మొత్తం కంటే ఈ అదనపు ఛార్జీలు ఎక్కువగా ఉండవచ్చు. ఇక ఈఎంఐ గడువు ముగియకముందే కార్డును మూసివేస్తే మిగిలిన బకాయిలను బ్యాంకులు లెక్కించవచ్చు. జప్తు, ఇతర ఛార్జీలు ఉండవచ్చు. మీరు కార్డు క్లోజ్ చేయాలనుకుంటే ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి.
ఇక క్రెడిట్ కార్డు బ్లాక్ చేయడం, క్లోజ్ అనేది ఒక్కటేనని చాలామంది అనుకుంటారు. ఈ రెండు వేర్వురు అని అర్థం చేసుకోవాలి. మీ కార్డు పోయినా లేదా దొంగలించబడినా వెంటనే బ్లాక్ చేయవచ్చు. ఇలాంటి సమయంలో బ్యాంకు మీకు మరో కార్డు జారీ చేస్తుంది. అప్పుడు మీ పాత కార్డు యాక్టివ్‌గా ఉన్నా ఆ నెంబర్ పనిచేయదు. దీంతో ప్రస్తుతం ఉన్న ఈఎంఐలు అలాగే కొనసాగుతాయి. ఇక ఒకసారి క్రెడిట్ కార్డు పర్మినెంట్‌గా క్లోజ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఈఎంఐ చెల్లించడం ఆపేయకూడదు. మీరు చెల్లించకుండా ఆపివేస్తే ఓవర్ డ్యూ పెరుగుతుంది. అప్పుడు అధిక వడ్డీ, జరిమానాలు పడతాయి. అంతేకాకుండా మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో క్రెడిట్ కార్డు మీరు పర్మినెంట్‌గా క్లోజ్ చేయాలనుకుంటే ముందుగా బిల్లు మొత్తం చెల్లించండి. అనంతరం క్లోజర్ రిక్వెస్ట్ పెట్టుకోవడం మంచిది.