
నాన్ వెజ్ ప్రియులకు పిడుగులాంటి వార్త. చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల దసరా, దీపావళి లాంటి వరుస పండుగల క్రమంలో డిమాండ్ వల్ల ధరలు పెరగ్గా.. ఇప్పటికీ అదే స్థా్యిలో కొనసాగుతున్నాయి. అయితే ఎల్‌నివో ప్రభావం వల్ల మేత కొరత, మేత ధరలు పెరగడం వల్ల రాబోయే రోజుల్లో కోడిగుడ్లు, చికెన్ ధరలు భారీగా పెరగనున్నట్లు పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ నాటికి ధరలు ఏకంగా 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో నాన్‌వెజ్ ప్రియులకు ముద్ద దిగాలంటే జేబులకు చిల్లులు పడక తప్పని పరిస్థితి రానుందని తెలుస్తోంది.
-నవంబర్ 14వ తేదీన చికెన్ ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.252 వద్ద కొనసాగుతుండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.223, రిటైల్ లైవ్ బర్డ్ రూ.144, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.117కు లభిస్తున్నాయి
-తెలంగాణతో పోలిస్తే ఏపీలో చికెన్ ధరలు మరింత పెరిగాయి. విజయవాడ జోన్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.266, డ్రస్స్‌డ్ రూ.236, రిటైల్ లైవ్ బర్డ్ రూ.152, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.125గా కొనసాగుతోంది
హైదరాబాద్‌లో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.88 వద్ద ఉండగా.. విజయవాడ జోన్ పరిధిలో రూ.80గా కొనసాగుతున్నాయి.
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతుండటంతో మార్కెట్‌లో మాంసానికి డిమాండ్ విపరీతంగా పెరుగనుంది. ఎల్నివో వల్ల కోళ్లకు పెట్టే దానా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. మొక్కజొన్న, నూకల ధరలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయి. గత ఏడాది కిలో రూ.18 ఉన్న మొక్కజొన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.34కి చేరుకుంది. ఇది డిసెంబర్ నాటికి రూ.40 చేరుతుందని చెబుతున్నారు. అలాగే కిలో రూ.14 నుంచి రూ.15 ఉన్న నూకల ధర ప్రస్తుతం 31 నుంచి 32 రూపాయలకు ఎగబాకింది. దీంతో పౌల్ట్రీ రైతులకు ఖర్చు పెరగడంతో ధరలు పెంచేందుకు సిద్దమవుతున్నారు. ఖర్చులు పెరగడం వల్ల డిసెంబర్, జనవరి నాటికి పౌల్ట్రీ ఉత్పత్తి ఏకంగా 20 శాతానికిపైగా తగ్గిపోతుందని వ్యాాాపారులు చెబుతున్నారు. ఒకవైపు దానా ధరల మంట, మరోవైపు పడిపోయిన ఉత్పత్తి వంటివి చికెన్, కోడిగుడ్ల ధరలను పెంచనున్నాయి. దీంతో ఇది సామాన్యుడి కంచంపై పడనుంది. ఇప్పటికే కూరగాయల ధరలు, పప్పుల ధరలు ఆందోళన కలిగిస్తుండగా.. ఇప్పుడు కోడిగుడ్డు, చికెన్ ధరలు కూడా పెరిగే సామాన్యుడిపై పెను భారం పడనుంది.