
UPI Payments: భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగింది. టీ కొట్టు దగ్గరి నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసినా ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం ద్వారా క్షణాల్లోనే డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే యూపీఐ లావాదేవీలపై కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధించాలనే ప్రతిపాదన ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఛార్జీల అమలు ఇప్పటికే వాయిదా పడగా.. తాజాగా 2027లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా వాయిదా పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. మరి ఈ కొత్త ఛార్జీలు ఎవరికి వర్తిస్తాయి? సామాన్య ప్రజలు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బులు పంపితే కూడా ఛార్జీలు పడతాయా? తెలుసుకుందాం.
వార్తా కథనాల ప్రకారం.. యూపీఐ లావాదేవీలపై ఎంపిక చేసిన చెల్లింపులకు ఎండీఆర్ ఛార్జీల అమలును 2027 అసెంబ్లీ ఎన్నికల తర్వాతకు వాయిదా వేసే అవకాశం ఉంది. 2027 ప్రథమార్ధంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో వ్యాపారులు, వర్తక సంఘాల నుంచి వ్యతిరేకత రావచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షీయల్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. అయితే ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇంకా తుది అమలు తేదీపై నిర్ణయం తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాతకు వాయిదా పడటం కూడా ఒక అవకాశమే కానీ, అది అత్యంత ఆలస్యమైన పరిస్థితి మాత్రమేనని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
MDR అంటే Merchant Discount Rate. అంటే కస్టమర్లు డిజిటల్ పేమెంట్స్ చేసినప్పుడు ఆ లావాదేవీని ప్రాసెస్ చేసే బ్యాంకులు, పేమెంట్ సంస్థలకు వ్యాపారులు చెల్లించే సర్వీస్ ఛార్జీ. ప్రతిపాదిత కొత్త విధానం ప్రకారం.. నిర్దిష్ట నిబంధనలకు లోబడి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే (Person-to-Merchant) UPI చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ విధించనున్నారు. అయితే ఈ ఛార్జీకి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300 మాత్రమే ఛార్జీగా నిర్ణయించారు.
ప్రతిపాదిత ఎండీఆర్ విధానంలో అన్ని యూపీఐ చెల్లింపులపైనా ఛార్జీలు విధించడం లేదు. కొన్ని లావాదేవీలకు మినహాయింపులు ఉన్నాయి.
ఇదే సామాన్య ప్రజలకు అత్యంత ముఖ్యమైన విషయం. ప్రతిపాదిత విధానంలో MDR ఛార్జీని వ్యాపారుల నుంచి వసూలు చేయాలి. ఈ ఛార్జీని కస్టమర్లపై నేరుగా వేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే మీరు స్నేహితుడికి రూ.5,000 పంపినా, కుటుంబ సభ్యులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా ఈ ఎండీఆర్ వర్తించదు. అలాగే రూ.2,000 వరకు చేసే అర్హత కలిగిన వ్యాపార చెల్లింపులపైనా MDR ఉండదు. అయితే రూ.2,000 కంటే ఎక్కువ విలువైన అర్హత కలిగిన వ్యాపార లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తించే అవకాశం ఉంది.
ఇప్పటివరకు యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ స్వీకరించడంపై వ్యాపారులకు సాధారణంగా ఎండీఆర్ ఛార్జీలు లేవు. ఇప్పుడు కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తే తమపై అదనపు ఆర్థిక భారం పడుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారులు ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ నిర్వహణ, సాంకేతికత అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలకు భారీగా ఖర్చవుతోందని పేమెంట్ కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండీఆర్ అమలుకు సరైన సమయం కోసం ప్రభుత్వం, ఆర్బీఐ, NPCI చర్చలు కొనసాగిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఛార్జీల అమలుకు సంబంధించి అధికారిక కొత్త తేదీ ప్రకటించలేదు. మొదట అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించినప్పటికీ, పండుగ సీజన్, వ్యాపారుల అభ్యంతరాల కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు 2027 అసెంబ్లీ ఎన్నికల తర్వాతకు కూడా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ప్రస్తుతానికి సామాన్య యూపీఐ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం ద్వారా వ్యక్తిగతంగా డబ్బులు పంపుకోవడం, రూ.2,000 వరకు అర్హత కలిగిన వ్యాపార చెల్లింపులు చేయడం ఉచితంగానే కొనసాగనున్నాయి. కొత్త ఛార్జీల విధానం అమలుపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: NEFT Transfer Limit: మీరు ఒక రోజులో ఎంత డబ్బు బదిలీ చేయవచ్చు.. ఆర్బీఐ రూల్స్, ఛార్జీలు ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి