
Bank Loan Guarantor: రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు పెన్షనే ప్రధాన ఆదాయం. ఆ డబ్బుతోనే నెలవారీ ఖర్చులు, మందులు, కుటుంబ అవసరాలను తీర్చుకుంటుంటారు. అయితే తెలిసినవారికో, బంధువులకో బ్యాంకు రుణం తీసుకునే సమయంలో గ్యారంటీగా సంతకం చేశారా? అయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. రుణం తీసుకున్న వ్యక్తి అప్పు చెల్లించకపోతే గ్యారంటీ ఇచ్చిన వ్యక్తిపై కూడా బ్యాంకులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఒక వ్యక్తి రుణం తీసుకుంటే, అతనికి గ్యారంటీగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ ఖాతా నుంచి బ్యాంకు డబ్బులు వసూలు చేయవచ్చా? ఈ అంశంపై జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నజీర్ అహ్మద్ కుచాయ్ అనే రిటైర్డ్ పోలీసు ఉద్యోగి మరొక వ్యక్తి బ్యాంకు రుణానికి గ్యారంటీగా ఉన్నారు. ఆ వ్యక్తి జమ్మూ కాశ్మీర్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అయితే రుణం తీసుకున్న వ్యక్తి వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన కుచాయ్ ఖాతా నుంచి డబ్బులు మినహాయించడం ప్రారంభించింది.
అప్పటికే ఆయన ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. కుటుంబ పోషణకు పెన్షన్ మాత్రమే ప్రధాన ఆదాయంగా ఉంది. ఈ విషయాన్ని బ్యాంకుకు తెలియజేసినప్పటికీ డబ్బుల కోత కొనసాగడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెన్షన్ అనేది ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం అందించే ఆర్థిక భద్రత అని పేర్కొంది. రిటైర్డ్ ఉద్యోగి కుటుంబానికి పెన్షనే ఏకైక ఆదాయ వనరుగా ఉన్నప్పుడు, మరొక వ్యక్తి రుణం చెల్లించలేదనే కారణంతో ఆ పెన్షన్ ఖాతా నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి పెన్షన్ ఖాతా నుంచి ఇకపై రుణ బకాయిలను వసూలు చేయకూడదని ఆదేశించింది. 2026 నవంబర్ 13న జస్టిస్ మోక్ష ఖజూరియా కజ్మీ ఈ తీర్పు ఇచ్చారు.
హైకోర్టు మరో ముఖ్యమైన విషయం కూడా స్పష్టం చేసింది. గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి పెన్షన్ ఖాతా నుంచి డబ్బులు వసూలు చేయకూడదని చెప్పినంత మాత్రాన అసలు రుణగ్రహీత అప్పు నుంచి విముక్తి పొందినట్లు కాదు. బ్యాంకుకు రుణం వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. అయితే అసలు రుణం తీసుకున్న వ్యక్తి నుంచి చట్టబద్ధమైన మార్గాల్లో బకాయిలను వసూలు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ఇప్పటికే పెన్షన్ ఖాతా నుంచి కట్ చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలన్న అంశాన్ని మాత్రం ట్రయల్ కోర్టు పరిశీలించాలని పేర్కొంది. అంటే గతంలో కట్ చేసిన మొత్తం ఆటోమేటిక్‌గా తిరిగి వస్తుందని ఈ తీర్పు అర్థం కాదు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇదే జమ్మూ కాశ్మీర్ హైకోర్టు 2026 ఫిబ్రవరిలో చునీ లాల్ వర్సెస్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కేసులో భిన్నమైన పరిస్థితుల్లో తీర్పు ఇచ్చింది. ఆ కేసులో రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి మరొకరి రూ.15 లక్షల హౌసింగ్ లోన్‌కు గ్యారంటీ ఇచ్చారు. రుణగ్రహీతలు డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంకు ఆయన పెన్షన్ ఖాతా నుంచి రూ.4.64 లక్షలు వసూలు చేసింది. పెన్షన్ బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత దానికి ఉన్న చట్టపరమైన రక్షణ వర్తించదని, గ్యారంటీ ఒప్పందం ప్రకారం వసూలు చేయవచ్చని అప్పటి తీర్పులో కోర్టు పేర్కొంది.
అయితే నవంబర్ కేసులో రిటైర్డ్ ఉద్యోగి కుటుంబానికి పెన్షనే ఏకైక ఆదాయ వనరు కావడం, ఉద్యోగంలో ఉన్నప్పుడే గ్యారంటీ ఇవ్వడం వంటి ప్రత్యేక పరిస్థితులను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అందువల్ల పెన్షన్ ఖాతాలో డబ్బులు ఉన్నాయనే కారణంతో అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు వసూలు చేయవచ్చని లేదా అస్సలు వసూలు చేయలేవని చెప్పలేం. ప్రతి కేసులోని వాస్తవాలు, గ్యారంటీ ఒప్పందం, వర్తించే చట్టాలను పరిశీలించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Indian Railways: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి శబరిమలకు స్పెషల్ ట్రైన్స్!
ఇది కూడా చదవండి: Personal Finance: మీ లైఫ్‌స్టైల్‌ను మార్చే మ్యాజిక్ ఇదే.. నెలకు రూ.3 వేల పెట్టుబడి.. మీ చేతికి రూ.1.05 కోట్లు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి