
Ambani vs Musk: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ఇప్పుడు అంతరిక్షం (Space) నుంచి ఇంటర్నెట్ అందించే మహా యుద్ధానికి సిద్ధమైంది. ఇప్పటికే టెలికాం రంగంలో జియోతో విప్లవం సృష్టించిన అంబానీ, ఇప్పుడు తన దృష్టిని శాటిలైట్ కమ్యూనికేషన్ (Satcom) వైపు మళ్లించారు. ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’, అమెజాన్ ‘ప్రాజెక్ట్ కైపర్’ వంటి గ్లోబల్ దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రిలయన్స్ బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బాధ్యతలను జియో ప్లాట్‌ఫామ్స్ (JPL) చూసుకోనుంది. ముఖ్యంగా లో ఎర్త్ ఆర్బిట్ (LEO) విభాగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేయర్‌గా అవతరించాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. స్వయంగా ముఖేష్ అంబానీ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుండటం విశేషం. ఆయనతో పాటు పీకే భట్నాగర్, మాథ్యూ ఊమెన్, ఆయుష్ భట్నాగర్ వంటి సీనియర్ అధికారులు ఈ మిషన్‌లో పాలుపంచుకుంటున్నారు.
ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు రిలయన్స్ 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ టీమ్‌లు శాటిలైట్ డిజైన్, లాంచింగ్, పేలోడ్, యూజర్ టెర్మినల్స్ వంటి సాంకేతిక అంశాలపై పని చేస్తున్నాయి. రాబోయే 2 నుండి 4 ఏళ్లలో తన సొంత LEO శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే పలు విదేశీ శాటిలైట్ టెక్నాలజీ కంపెనీలతో చర్చలు జరుపుతోంది.
శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో ఒక బలమైన భారతీయ కంపెనీ ఉండాలని భారత ప్రభుత్వం కూడా కోరుకుంటోంది. అయితే స్వదేశంలోకి అడుగులు పెడుతున్న స్టార్ లింకుకు చెక్ పెట్టేందుకు జియో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైనా సుమారు 2 లక్షల శాటిలైట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. భద్రతా పరంగా భారత్‌కు సొంత శాటిలైట్ నెట్‌వర్క్ (Constellation) ఉండటం చాలా కీలకం. అందుకే ఆర్బిట్ స్లాట్లు, రేడియో ఫ్రీక్వెన్సీల కోసం జియో ఇప్పటికే టెలికాం శాఖను సంప్రదించింది.
స్టార్‌లింక్, అమెజాన్‌లతో పోటీ పడేందుకు జియో అన్ని దారులను అన్వేషిస్తోంది. కేవలం సొంతంగా నిర్మించుకోవడమే కాకుండా, ఇప్పటికే నెట్‌వర్క్, స్లాట్లు ఉన్న విదేశీ కంపెనీలను కొనుగోలు చేసే ఆలోచనలో కూడా ఉంది.
శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో జియోకు గట్టి పోటీ:
ప్రస్తుతం జియోకు SES కంపెనీతో భాగస్వామ్యం ఉన్నప్పటికీ, అది కేవలం మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO)కే పరిమితమైంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో LEO సెగ్మెంట్‌లోకి రావడం ద్వారా డేటా ప్రైవసీ, డిజిటల్ సార్వభౌమత్వంలో భారత్ స్వయంసమృద్ధి సాధించనుంది.
| విభాగం | వివరాలు |
| కంపెనీ | రిలయన్స్ జియో (JPL) |
| ప్రధాన పోటీదారు | ఎలాన్ మస్క్ (స్టార్‌లింక్) |
| సాంకేతికత | LEO (Low Earth Orbit) శాటిలైట్లు |
| లక్ష్యం | అంతరిక్షం నుండి హై-స్పీడ్ ఇంటర్నెట్ |
| సమయపరిమితి | రాబోయే 2 నుండి 4 ఏళ్లు |
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి