
Annadata Sukhibhava: ఏపీ రైతులకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న పీఎం కిసాన్, అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకాల నిధుల జమకు తేదీ ఖరారైనట్లు సమాచారం. దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 17న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండో విడత నిధులను నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా వినాయక చవితి రోజునే నిధులు విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజాగా జరిగిన చర్చల అనంతరం అక్టోబర్ 17న నిధులు జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ స్కీమ్‌తో రాష్ట్రంలోని ‘అన్నదాత సుఖీభవ’ను అనుసంధానించి అమలు చేస్తున్నారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6 వేల చొప్పున అందిస్తోంది. దీనికి అదనంగా ఏపీ సర్కార్ ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏడాదికి 14 వేల రూపాయలను అందిస్తోంది. అయితే ఈ రెండు పథకాల ద్వారా కలిపి రాష్ట్రంలోని అర్హులైన రైతులకు ఏడాదికి మొత్తం రూ.20 వేల ఆర్థిక సాయం అందనుంది.
ఈ డబ్బులను మూడు విడతల్లో రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులను జూన్ 20న సీఎం చంద్రబాబు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఒక్కో రైతు కుటుంబానికి రూ.7 వేల చొప్పున అందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 వేలతో పాటు పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే రూ.2 వేల కూడా ఉన్నాయి.
మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ఇందుకోసం మొత్తం సుమారు రూ.3,125.47 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు రెండో విడతలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను కలిపి ఒక్కో రైతుకు రూ.6 వేల చొప్పున అందించనున్నారు.
మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాయో.. లేదో అనేది ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. కేవలం మీ ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెకన్లలోనే స్టేటస్ చెస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభం పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌లోకి వెళ్లి మీకు డబ్బులు వచ్చాయా.. లేదా.. అనేది స్టేటస్ సులువుగా చెక్ చేసుకోవచ్చు. అలాగే అన్నదాత సుఖీభవ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. యాప్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి