బ్రేకింగ్.. ఇస్లామాబాద్ లో ఇద్దరు ఇండియన్ హైకమిషన్ అధికారుల మిస్సింగ్

| Edited By: Anil kumar poka

Jun 15, 2020 | 12:16 PM

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ అధికారులు ఇద్దరు కనబడడం లేదు. సోమవారం ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతం నుంచి వారి ఆచూకీ తెలియడంలేదని సమాచారం...

బ్రేకింగ్.. ఇస్లామాబాద్ లో ఇద్దరు ఇండియన్ హైకమిషన్ అధికారుల మిస్సింగ్
Follow us on

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ అధికారులు ఇద్దరు కనబడడం లేదు. సోమవారం ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతం నుంచి వారి ఆచూకీ తెలియడంలేదని సమాచారం. దీనిపై పాక్ ప్రభుత్వానికి భారత్ ఫిర్యాదు చేసింది. ఢిల్లీ లోని పాకిస్థానీ హైకమిషన్ లో పని చేస్తున్న ఇద్దరు అధికారులు గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో వారిని పాక్ కు తిప్పి పంపివేశారు. బహుశా ఈ ఘటనకు, ఈ తాజా సంఘటనకు లింక్ ఉండవచ్చునని భావిస్తున్నారు. పాకిస్తాన్ లో పలువురు భారత దౌత్య ప్రతినిధులపై అనేకరోజులుగా నిఘా ఉంటోంది. దీనిపై భారత ప్రభుత్వం పలుమార్లు ఆ దేశానికి నిరసన కూడా తెలిపింది.

కాగా.. ఇటీవల భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లువాలియా వాహనాన్ని పాక్ ఐఎస్ఐ సభ్యుడొకరు తన టూ వీలర్ పై ఫాలో అయ్యాడట.. గత మార్చి నెలలో తమ అధికారులను పాక్ అధికారులు వేధిస్తున్నారని, నిఘా పెడుతున్నారని పాక్ లోని ఇండియన్ హైకమిషన్.. పాకిస్థాన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మొత్తం 13 దృష్టాంతాలను ఆ దేశ విదేశాంగ శాఖకు వివరించింది. ఇలాంటివి జరగకుండా చూడాలని కూడా అభ్యర్థించింది.

గత మే 31 న ఢిల్లీ కరోల్ బాగ్ లోని పాకిస్థానీ హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న అబ్ది హుసేన్ ఆబిద్ (42),తాహిర్ ఖాన్ (44) అనే ఇద్దరు అధికారులు గూడచర్యానికి పాల్పడుతూ భారత అధికారులకు పట్టుబడ్డారు. ఇందుకు వారిద్దరినీ ఈ నెల 1 న తిరిగి పాకిస్థాన్ కి పంపివేశారు. వీరు ఫేక్ ఇండియన్ ఐడెంటిటీలుగా చెప్పుకున్నారని, ఫేక్ ఆధార్ కార్డును ఉపయోగించారని తెలిసింది. వారి నుంచి రెండు యాపిల్ ఐ ఫోన్లను, 15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు పాకిస్థానీ డిప్లొమాటిక్ కారులో వచ్చారని, ఆ తరువాత ఆ వాహనాన్ని పాక్ హైకమిషన్ అమ్మివేయడానికి యత్నించిందని కూడా సమాచారం.