శాపగ్రస్థ రాజధాని

| Edited By: Anil kumar poka

Jan 03, 2020 | 10:01 AM

అప్పుడు మద్రాసు… తర్వాత కర్నూల్..ఆ తర్వాత హైదరాబాద్..ఆ తర్వాత అమరావతి..ఇప్పుడు విశాఖ..రేపు??? ఆంధ్రులకు రాజధాని శాపం కచ్చితంగా తగిలినట్టే అనిపిస్తుంది..ఎప్పుడో ఆంధ్రుల పూర్వీకులు..చేసిన ఏదో పాపానికి మీకు భవిష్యత్తులో రాజధాని లేకుండా గందరగోళం మధ్య బతుకుదురు గాక ..అని ఎవరో ఋషి పుంగవులు శపించినట్టే అనిపిస్తుంది….ఒకవిధంగా శాపగ్రస్థ ఆంధ్రులుగానే పిలవాల్సి ఉంటుంది.. బహుశా ఈ శాపం దేశంలో ఏ రాష్ట్రానికి ఇంతవరకూ లేదు..ఇకపై ఉండకపోవచ్చు.. ఎందుకంటే..అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసున్నప్పుడు.. ఈ అరవోళ్లతో కలిసి ఉండలేమన్నాం.. ఇడ్లీ […]

శాపగ్రస్థ రాజధాని
Follow us on

అప్పుడు మద్రాసు… తర్వాత కర్నూల్..ఆ తర్వాత హైదరాబాద్..ఆ తర్వాత అమరావతి..ఇప్పుడు విశాఖ..రేపు???
ఆంధ్రులకు రాజధాని శాపం కచ్చితంగా తగిలినట్టే అనిపిస్తుంది..ఎప్పుడో ఆంధ్రుల పూర్వీకులు..చేసిన ఏదో పాపానికి మీకు భవిష్యత్తులో రాజధాని లేకుండా గందరగోళం మధ్య బతుకుదురు గాక ..అని ఎవరో ఋషి పుంగవులు శపించినట్టే అనిపిస్తుంది….ఒకవిధంగా శాపగ్రస్థ ఆంధ్రులుగానే పిలవాల్సి ఉంటుంది.. బహుశా ఈ శాపం దేశంలో ఏ రాష్ట్రానికి ఇంతవరకూ లేదు..ఇకపై ఉండకపోవచ్చు..

ఎందుకంటే..అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసున్నప్పుడు.. ఈ అరవోళ్లతో కలిసి ఉండలేమన్నాం.. ఇడ్లీ సాంబార్ నుంచి మా అవకాయని వేరు చేయమని డిమాండ్ చేశాం.. స్వార్ధం తెలీని మహానుభావుడు పొట్టిశ్రీరాములు లాంటివారిని బలి ఇచ్చాం..అంతేకాదు..ప్రత్యేక రాష్ట్రంతో పాటు మద్రాసు మాదేనన్నాము.. అరవోళ్ల …అరుపులతో కర్నూల్ పరిగెత్తాల్సి వచ్చింది..తుంగభద్ర నది ఒడ్డున టెంట్లు వేసుకుని పరిపాలన మొదలై మూడేళ్లయినా కాకముందే.. మళ్లీ విశాల ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ కు మకాం మార్చాం.. 1956 నుంచి 2014 వరకూ తెలంగాణతో బంధం ఎన్నో ఒడిదుడుకులు మధ్య సాగింది… తెలంగాణ గర్జన తో మళ్లీ తట్టా బుట్టా సర్దుకుని అమరావతిలో వచ్చి పడ్డాం..ఇక్కడ మహా అమరావతి నిర్మాణం గ్రాఫిక్స్ తో మొదలై మొండిగోడల వరకు వచ్చి ఆగింది..మళ్లీ గవర్నమెంట్ మారింది..పాలకుల ఆలోచన మారింది..రాజధాని మూడు ముక్కలైయింది..పరిపాలన విశాఖ తీరానికి మారుతోంది.. పోనీ ఇక్కడైనా శాశ్వతంగా ఉంటుందా అంటే…గ్యారంటీ లేదు..భవిష్యత్తులో మళ్లీ అధికారం మారితే అప్పటి నాయకుడి ఆలోచనలకు అనుగుణంగా రాజధాని మారవచ్చు..

..అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా ప్రారంభించి ఉంటే బహుశా ఈ పరిస్థితి ఉండేది కాదేమో.. శంఖుస్థాపనల మీద శంఖుస్థాపనలు చేస్తూ సమయం వృధా చేశారు.. భారీ రాజధాని నిర్మాణమంటూ 33వేల ఎకరాలు రైతుల నుంచి ల్యాండ్ పూలింగుల పేరుతో.. సేకరించి ఐదేళ్లు వాటిని ఖాళీగా ఉంచారు.. పచ్చని పంటలు పండే భూములు ముళ్ల కంపలతో నింపేశారు..రాజధాని ఇక్కడే వస్తుందని కొంతమందికి ముందుగానే చెప్పి వేలాది ఎకరాలు అతి తక్కువ ధరకు కొనేసి ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసారనేది..ముఖ్యమంత్రి జగన్ ఆరోపణ.. స్విస్ ఛాలెంజ్ లంటూ ఎవరికీ అర్ధంకాని విధానాల అమలు వల్ల రాజధానిలో సగం పూర్తయిన రోడ్లు, పూర్తి గాని అపార్ట్ మెంట్లు, స్లాబుల్లో ఆగిపోయిన కొత్త అసెంబ్లీలు మిగిలాయి.. ఇప్పుడు అదే కారణాలతో వైసిపి ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలు చేసి మూడు ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేస్తోంది..

మూడు ముక్కలు ఆలోచన బాగానే ఉంది..కానీ అమలు ఎంతవరకు సాధ్యం అనేది ప్రశ్న..కేంద్రం నిధులివ్వకపోతే కష్టమే.. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయలేదు.. ఇప్పుడు మూడు రాజధానులకి నిధులు ఇస్తారా అనేది చర్చించాల్సిన అంశం.. హైకోర్టు కర్నూల్ లో వచ్చినందుకు రాయలసీమ వాసులు సంతోషించవచ్చు.. కానీ దాని వల్ల సీమ అభివృద్ధి ఎంతవరకూ అన్నది ప్రశ్న.. ఎందుకంటే హైకోర్టు చుట్టుపక్కల రెండు క్యాంటీన్లు, నాలుగు టీ దుకాణాలు వెలుస్తాయి తప్ప పెద్దగా ప్రయోజనం ఏముంటుంది.. న్యాయవాదుల హడావిడి పెరుగుతుంది..తప్ప అక్కడ అభివృద్ధి ఏముంటుంది.. న్యాయవిభాగం చేరువైందని..కొండారెడ్డి బురుజు జ్యుడీషయల్ రాజధాని అయిందని గర్వంగా చెప్పుకోవడమే తప్ప సీమలో కొత్తగా అభివృద్ధి జరుగుతుందనుకోవడం లేదు..

ఇక అనంతపురం నుంచి సెక్రటేరియట్ కు వెళ్లాలంటే.. విశాఖ వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు.. భారంగా మారొచ్చు.. మాకు పరిపాలన కేంద్రం ఇక్కడే ఏర్పాటు చేయాలని మళ్లీ కొత్త ఉద్యమం మొదలై ఆ ఆశ్చర్య పోనక్కర్లేదు.. కర్నూల్ లో రాజధాని ఉన్నప్పుడు తప్ప మిగిలిన ఎక్కడ రాజధాని ఉన్నా సరే.. సీమ వాసులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు..ఇకపైనా ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు..

అలాగే తమదగ్గర భూములు తీసుకుని రాజధాని ఏర్పాటు చేస్తామని గ్రాఫిక్స్ చూపి..ఇప్పుడు రాజధానిని తీసుకెళ్లిపోయి.. అసెంబ్లీ ని మిగులుస్తామంటే..బహుశా కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు ఒప్పుకోకపోవచ్చు.. రాజధాని కావాలంటూ ఇక్కడి ప్రజలు ఆందోళనలు చేసే అవకాశం ఉంటుంది..ఇక్కడే మళ్లీ కమ్యూనిస్టులకి చేతినిండా పని దొరుకుతుంది..

ఇక ప్రతిపక్షాలకు ఇబ్బందికర పరిస్థితి..ఎందుకంటే రాజదాని ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయొద్దని చెప్పలేరు..అలాగే కర్నూల్ లో హైకోర్టు వద్దని అనలేరు.. ఒక విచిత్రమైన పరిస్థితి..ఏమి మాట్లాడితే..ఎక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందోనని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి..

ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికీ హైదరాబాద్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రైన్లలో హైదరాబాద్ నుంచి వస్తున్నారు..అమరావతికి ఇంకా షిఫ్ట్ కాలేదు…. ఇకపై వారి కోసం హైదరాబాద్ నుంచి విశాఖకు కొత్త ట్రైన్ వేయాల్సి ఉంటుంది..

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కొంతకాలం విశాఖలో రియల్ ఎస్టేట్ బూమ్ ఊపందుకుంటుంది..ఐదేళ్ల క్రితం అమరావతిలో ఉన్న మాదిరిగా రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ తమ బోర్డులని విశాఖ తీరానికి మారుస్తాయి..

సంకుచిత మనస్తత్వం, కులాల కుమ్ములాటలు, ప్రాంతీయ విభేదాలు ఏపీకి ప్రత్యేకం..బహుశా ఇది ఇక్కడి ప్రజల DNA లోనే ఉందా ..అనిపిస్తుంది..అందుకే తుఫాన్ గాలికి ఎదురుగా ఫ్యాన్ పెట్టి కరెంట్ ఎలా తీయాలా అని ఆలోచించగలిగిన మేధావులు ఇక్కడ ఉంటారు.. కానీ తుఫాన్ కి కొట్టుకుపోతున్న ఇంటిని కాపాడుకోవడం మర్చిపోతారు..

మద్రాస్ నుంచి నేటి విశాఖ వరకూ ఎక్కడా ప్రజాభిప్రాయం తీసుకున్నది లేదు..1953 నుంచి 2019 వరకూ ఇన్ని రాజధానులు మారితే..బాగుపడింది మాత్రం రాజకీయ నాయకులు.నష్టపోయింది..ప్రజలు.. ఖద్దరు చొక్కాలు అదేశిస్తాయి..ఖాకీ చొక్కాల సాయంతో..పాలిస్టర్ చొక్కాలు అమలు చేస్తాయి అంతే..