
జూన్ 2026 నాటికి జరుగనున్న గురు గ్రహ సంచారం జరగనుంది. సాధారణంగా దేవగురువైన బృహస్పతి ఒక రాశిలో సుమారు 12 మాసాలు సంచారం చేస్తారు. సూర్యుడి చుట్టూ గురు గ్రహం తిరగడానికి 12 సంవత్సరాలు పడుతుంది, అదే సమయంలో భూమికి 365 రోజులు పడుతుంది. ఈ కాలమాన వ్యత్యాసం భూమి, బృహస్పతి గ్రహాల కాలమానంలో తేడాలను సూచిస్తుంది. అయితే, ఈ సంవత్సరం జూన్ నెల రెండవ తారీకున బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమించి అక్టోబర్ 31 వరకు అక్కడే ఉంటారు. అనంతరం నవంబర్ ఒకటవ తారీకు నుంచి జనవరి 26 వరకు సింహరాశిలోకి, తిరిగి జనవరి 26న కర్కాటకంలోకి ప్రవేశించి జూన్ నెల వరకు అక్కడే సంచరిస్తారు. ఈ విధంగా ఒక సంవత్సరంలో గురువు మూడు రాశులలో సంచరించడం పంచాంగ సరళి గ్రంథం ప్రకారం విపరీతమైన స్థితిగా అభివర్ణించబడింది. దీని వల్ల ఇంధన సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణం, కొత్త వైరస్‌లు (హంటా వైరస్ వంటివి) వ్యాప్తి చెందడం, ప్రజలు ఇబ్బందులు పడడం వంటి వైపరీత్యాలు సంభవిస్తాయని ఆ గ్రంథం హెచ్చరించింది. బృహస్పతి యొక్క ఈ మార్పు ప్రకృతిపై, అలాగే ప్రతి వ్యక్తిగత రాశిపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కన్యా రాశి వారికి ఈ గురు సంచారం అత్యంత యోగదాయకమైనది.
దేవగురువైన బృహస్పతి వారికి 11వ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో 11వ స్థానాన్ని ఉపచయ స్థానం లేదా త్రిషడాయములలో ఒకటిగా పేర్కొంటారు. ఈ స్థానంలోకి ఏ గ్రహం వెళ్ళినా అది విపరీతమైన రాజయోగాన్ని కలుగజేస్తుందని ప్రవచనం. గతంలో గురువు దశమంలో ఉన్నప్పుడు కన్యా రాశి వారు ధన నష్టం, ధాన్య నష్టం, అనవసర భయాలు, వృధా సంచరణం, ఉద్యోగ నష్టాలు, వృత్తిలో దెబ్బతినడం వంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే, ఇప్పుడు గురువు యొక్క ఈ మార్పు వారిని తిరిగి తలెత్తుకునేలా చేస్తుంది. “యశో వృద్ధేర్ బలం తేజః సర్వత్ర విజయ సుఖం” అనే సూక్తి ప్రకారం, కన్య రాశి వారికి కీర్తి ప్రతిష్టలు, బలం, తేజస్సు, సర్వత్రా విజయం, సుఖం లభిస్తాయి. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారికి మీరు గొప్ప తేజస్సుతో సమాధానం చెప్పగలుగుతారు. ఆర్థికంగా చితికిపోయారని అన్న వారికి సొంతింటిని, కారును కొనుగోలు చేసి చూపగలుగుతారు. సంతానం లేదని నిందించిన వారికి సంతానం కలిగి ఆనందాన్ని పంచుకుంటారు. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికంగా ఎంతో మెరుగుపడతారు, దైవ సాధనలో గొప్ప పురోగతి ఉంటుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, ఉద్యోగాలలో లాభాలు, పదోన్నతులు పొందుతారు. కుటుంబంలో ఆనందం, అభివృద్ధి నెలకొంటుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది. కోర్టు కేసులు మీకు అనూహ్యంగా అనుకూలంగా మారతాయి. గృహోపకరణాలు, బంగారం, గృహాలను కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీరు దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. మిమ్మల్ని బాధపెట్టిన పై అధికారులు బదిలీ అవ్వడం లేదా వారి ఉద్యోగాలలో మార్పులు రావడం వంటివి జరుగుతాయి. మీ ఎదుగుదలకు అడ్డుపడిన ప్రతివారు వెనకడుగు వేస్తారు. కన్యా రాశి వారికి గురుబలం, రాహుబలం కూడా తోడవ్వడంతో సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉండబోతున్నారు. ఈ శుభ ఫలితాలు గురువు మారిన వెంటనే కన్యా రాశి వారికి కనిపించి ఆనందాన్ని కలిగిస్తాయి.
(ఈ సమాచారం జ్యోతిష్య పండితుల నుంచి సేకరించాం)