
ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే సంఖ్యాశాస్త్రాన్ని నమ్మేవారి ప్రకారం పుట్టిన తేదీకి అనుగుణంగా కొన్ని ప్రత్యేక మొక్కలను ఇంట్లో లేదా కార్యాలయంలో పెంచడం అదృష్టాన్ని పెంచుతుందని చెబుతారు. అంతేకాదు, కొన్ని మొక్కలు మానసిక ప్రశాంతత, సానుకూల ఆలోచనలు, విజయానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయని నమ్మకం. మీ పుట్టిన తేదీకి ఏ మొక్క సరిపోతుందో ఇప్పుడు చూద్దాం.
సంఖ్య 1: 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు
ఏ నెలలోనైనా 1, 10, 19 లేదా 28వ తేదీన జన్మించినవారిని సంఖ్య 1కు చెందినవారిగా పరిగణిస్తారు. వీరిపై సూర్యుడి ప్రభావం ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. నాయకత్వ లక్షణాలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరిలో ఉంటాయని నమ్మకం. వీరు ఇంట్లో లేదా కార్యాలయంలో సన్ ఫ్లవర్ లేదా పొద్దుతిరుగుడు అని కూడా అంటారు.. మొక్కను పెంచుకోవడం శుభప్రదమని చెబుతారు. ఇది జీవితంలో సానుకూలత, ఆనందాన్ని పెంచుతుందని నమ్మకం.
సంఖ్య 2: 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారు
చంద్రుడి ప్రభావం ఉన్న సంఖ్యగా 2ను పరిగణిస్తారు. ఈ తేదీల్లో జన్మించినవారు భావోద్వేగపరంగా, సున్నితంగా ఉంటారని చెబుతారు. మానసిక ప్రశాంతత, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి జేడ్ మొక్కను పెంచుకోవడం మంచిదని సంఖ్యాశాస్త్ర విశ్వాసం.
సంఖ్య 3: 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు
3, 12, 21 లేదా 30వ తేదీన జన్మించినవారు సంఖ్య 3కు చెందుతారు. గురు గ్రహ ప్రభావంతో వీరు జ్ఞానవంతులుగా, ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటారని చెబుతారు. వీరు ఇంట్లో తులసి మొక్కను నాటి పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తి లభిస్తాయని నమ్మకం.
సంఖ్య 4: 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారు
4, 13, 22 లేదా 31వ తేదీన పుట్టినవారికి రాహువు అధిపతిగా చెబుతారు. వీరు వ్యాపారంలో ముందుంటారని, అయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని నమ్ముతారు. శాంతి, సహనం కోసం లిల్లీ మొక్కను చుట్టూ పెంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
సంఖ్య 5: 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు
బుధ గ్రహ ప్రభావం ఉన్న సంఖ్యగా 5ను పరిగణిస్తారు. ఈ తేదీల్లో పుట్టినవారు తెలివైనవారు, మంచి శ్రోతలుగా ఉంటారని చెబుతారు. వీరు ఇంట్లో మనీ ప్లాంట్‌ను పెంచుకోవడం వల్ల వాక్చాతుర్యం, సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడి అదృష్టం కలిసివస్తుందని నమ్మకం.
సంఖ్య 6: 6, 15, 24 తేదీల్లో పుట్టినవారు
6, 15 లేదా 24వ తేదీన జన్మించినవారికి శుక్రుడి ప్రభావం ఉంటుందని చెబుతారు. వీరు ప్రేమను పంచుకునే స్వభావం కలిగి ఉంటారని, అయితే కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గవచ్చని నమ్ముతారు. వీరు మల్లె మొక్కను పెంచుకోవడం వల్ల దాని సువాసన అంతర్గత ఆనందం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చెబుతారు.
సంఖ్య 7: 7, 16, 25 తేదీల్లో పుట్టినవారు
7, 16 లేదా 25వ తేదీల్లో జన్మించినవారిని కేతు ప్రభావం ఉన్నవారిగా పరిగణిస్తారు. వీరు ఎక్కువగా తమ సొంత ప్రపంచంలో ఉండటంతో పాటు ఏకాంతాన్ని ఇష్టపడతారని చెబుతారు. అయితే కొత్త వ్యక్తులను కలవాలనే ఆసక్తి కూడా ఉంటుందని నమ్మకం. జీవితంలో ఉత్సాహం, సానుకూల ఆలోచనలు పెంచుకోవడానికి బంతి మొక్కను పెంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
సంఖ్య 8: 8, 17, 26 తేదీల్లో పుట్టినవారు
8, 17 లేదా 26వ తేదీన పుట్టినవారిని శని గ్రహ ప్రభావం ఉన్నవారిగా చెబుతారు. వీరు కష్టపడి పనిచేసే, క్రమశిక్షణ కలిగినవారిగా ఉంటారని నమ్ముతారు. అయితే పనిలో అడ్డంకులు, మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతారు. మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి కోసం అలోవెరా లేదా స్నేక్ ప్లాంట్‌ను ఇంట్లో లేదా కార్యాలయంలో పెంచుకోవడం శుభప్రదమని భావిస్తారు.
సంఖ్య 9: 9, 18, 27 తేదీల్లో పుట్టినవారు
9, 18 లేదా 27వ తేదీన పుట్టినవారికి కుజుడి ప్రభావం ఉంటుందని చెబుతారు. వీరు ఉత్సాహంగా, ధైర్యంగా ఉండటంతో పాటు కొంత కోప స్వభావాన్ని కలిగి ఉంటారని నమ్మకం. అధిక శక్తి, కోపాన్ని నియంత్రించుకోవడానికి ఎర్ర గులాబీ, మందారం లేదా లక్కీ బాంబూ మొక్కలను పెంచుకోవడం మంచిదని చెబుతారు. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచడంతో పాటు వృత్తిలో విజయానికి తోడ్పడతాయని సంఖ్యాశాస్త్ర విశ్వాసం.
గమనిక:
పై వివరాలు సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన నమ్మకాల ఆధారంగా ఇవ్వబడినవి. మొక్కలను పెంచుకోవడం వల్ల అదృష్టం, డబ్బు లేదా విజయం ఖచ్చితంగా లభిస్తాయని శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. కాబట్టి వీటిని విశ్వాసం లేదా సాధారణ సమాచారంగా మాత్రమే పరిగణించాలి. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే నిర్ణయాలకు మా సంస్థ బాధ్యత వహించదు.