
వంటగదిని అన్నపూర్ణ నిలయంగా భావిస్తారు. అందుకే ఇక్కడ పరిశుభ్రతతో పాటు వస్తువులను ఎలా ఉంచుతున్నామనే విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా గ్యాస్ స్టవ్‌పై ఖాళీ గిన్నెలు, పాత్రలను ఉంచకూడదని నమ్ముతారు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఏర్పడుతుందని వాస్తు విశ్వాసం. ఉపయోగించని ఖాళీ పాత్రలను ఒకచోట సర్దిపెట్టి, వీలైతే బోర్లించి ఉంచాలని సూచిస్తారు.
ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పూజ గదిని భావిస్తారు. ఇక్కడ పూజకు ఉపయోగించే కలశం, నైవేద్య పాత్రలు వంటి వాటిని ఖాళీగా వదిలేయకూడదని వాస్తు సంప్రదాయాలు చెబుతున్నాయి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్య పాత్రలను అలాగే ఖాళీగా వదిలేయకుండా శుభ్రం చేసి పక్కన పెట్టాలి. ఉపయోగంలో లేని పాత్రలను బోర్లించి ఉంచడం మంచిదని నమ్ముతారు.
రాత్రిపూట దాహం వేస్తే వెంటనే నీళ్లు తాగేందుకు చాలామంది మంచం పక్కన నీళ్ల గ్లాసును పెట్టుకుంటారు. అయితే నీళ్లు తాగిన తర్వాత ఖాళీ గ్లాసును అక్కడే వదిలేస్తుంటారు. వాస్తు నమ్మకాల ప్రకారం పడక చుట్టూ ఖాళీ పాత్రలను ఉంచడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల నిద్రించే ప్రదేశంలోని సానుకూల వాతావరణం దెబ్బతింటుందని భావిస్తారు. కాబట్టి నీళ్లు తాగిన తర్వాత ఖాళీ గ్లాసును అక్కడి నుంచి తీసేయడం మంచిదని సూచిస్తారు.
ఇంటి ప్రధాన ద్వారానికి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లోకి శుభశక్తులు ప్రవేశించే మార్గంగా ప్రధాన ద్వారాన్ని భావిస్తారు. అలాంటి ప్రదేశంలో ఖాళీ గిన్నెలు, పాత్రలను ఉంచడం మంచిది కాదని వాస్తు విశ్వాసం. ఇలా చేయడం వల్ల ఇంటి అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నమ్ముతారు. అందుకే ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, వస్తువులు అడ్డంగా లేకుండా చూసుకోవాలి.
కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసే డైనింగ్ టేబుల్‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. భోజనం పూర్తయిన తర్వాత ఖాళీ ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులను అలాగే వదిలేయకూడదని చెబుతారు. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు డైనింగ్ టేబుల్‌ను శుభ్రం చేసి, ఖాళీ పాత్రలను వాటి స్థానాల్లో సర్దుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పరిశుభ్రతతో పాటు సానుకూల వాతావరణం ఉంటుందని విశ్వసిస్తారు.
గమనిక: పైన పేర్కొన్న విషయాలు వాస్తు శాస్త్ర నమ్మకాలు, సంప్రదాయాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఖాళీ పాత్రలను ఆయా ప్రదేశాల్లో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు.