
How to Stop Nightmares Telugu: కలలు అనేవి నిద్రలో సహజంగా వచ్చే అనుభవాలు. కొన్ని కలలు మనకు ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని భయాన్ని, ఆందోళనను కలిగిస్తాయి. ముఖ్యంగా కొంతమందికి తరచూ పీడకలలు వస్తుంటాయి. దీంతో నిద్ర మధ్యలో ఉలిక్కిపడి లేవడం, మళ్లీ నిద్ర పట్టకపోవడం, మరుసటి రోజు కూడా ఆ కలల ప్రభావంతో ఇబ్బంది పడటం జరుగుతుంది.
నిజానికి పగటిపూట మనం ఎదుర్కొనే సంఘటనలు, ఆలోచనలు, భావోద్వేగాలు, మానసిక ఒత్తిడి వంటివి రాత్రి కలలపై ప్రభావం చూపవచ్చు. భయం, అభద్రతా భావం, ఆందోళన కూడా పీడకలలకు కారణం కావచ్చు. హిందూ సంప్రదాయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలను సూచిస్తారు. ముఖ్యంగా నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయడం వల్ల సానుకూల భావనలు పెరుగుతాయని నమ్ముతారు. అవేంటో తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయంలో శారీరక శుద్ధితో పాటు మానసిక ప్రశాంతతకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే రాత్రి నిద్రపోయే ముందు చేతులు, కాళ్లు, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే స్నానం చేయవచ్చు. అనంతరం కాసేపు ప్రశాంతంగా కూర్చొని రోజంతా జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ మనసులోని ఆందోళనలను పక్కన పెట్టాలి. సానుకూల ఆలోచనలతో నిద్రకు ఉపక్రమించడం మంచిది.
రాత్రి నిద్రపోయే ముందు ఇష్టదైవాన్ని స్మరించుకోవడం హిందూ సంప్రదాయంలో మంచి ఆచారంగా భావిస్తారు. శివుడిని ఆరాధించేవారు ‘ఓం నమః శివాయ’ లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించవచ్చు. విష్ణుభక్తులు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని పఠించవచ్చు. అలాగే గాయత్రీ మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఇలా కొంతసేపు దైవధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత, ధైర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
హిందూ ధర్మంలో సూర్యభగవానుడిని శక్తి, కాంతి, చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ప్రతిరోజూ ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి నమస్కరించి, నీటిని సమర్పిస్తూ ప్రార్థించడం శుభప్రదమని నమ్ముతారు. ఈ అలవాటు రోజును సానుకూలంగా ప్రారంభించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది.
(Disclaimer: ఈ కథనంలో అందించిన విషయాలు హిందూ మత విశ్వాసాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాల ఆధారంగా పేర్కొనబడ్డాయి. వీటికి శాస్త్రీయంగా నిర్ధారిత ఆధారాలు లేవు. పీడకలలు తరచూ వస్తుంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)