
కుంభ రాశి అక్టోబర్ 2026 మాసఫలాలు: కుంభ రాశి వారికి అక్టోబర్ నెలలో మిశ్రమంగా ఉన్నప్పటికీ ఎక్కువగా అనుకూల ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం కొనసాగుతున్నప్పటికీ భాగ్య స్థానంలో బుధ, శుక్రుల సంచారం కారణంగా నెలంతా చాలావరకు సాఫీగా సాగుతుంది. అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తాయి. చేపట్టే ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది.
ఉద్యోగులకు కార్యాలయంలో అధికారుల నుంచి గుర్తింపు లభించవచ్చు. మీ సలహాలు, సూచనలు సంస్థకు ఉపయోగపడే అవకాశం ఉంది. పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారాలు బిజీగా సాగుతూ ఆర్థికంగా ప్రయోజనం కలిగించే అవకాశాలు ఉన్నాయి.
షష్ఠ స్థానంలో గురు, కుజుల ప్రభావంతో చాలాకాలంగా ఎదురవుతున్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది.
నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పిల్లల చదువు, కెరీర్‌లో పురోగతి కనిపించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒకటి, రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా సజావుగా సాగుతుంది.
అయితే వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణ అవసరం. అనవసర పరిచయాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. శని అనుగ్రహం కోసం శనికి తైలాభిషేకం చేయించడం మంచిదని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి.
గమనిక: ఈ కథనంలోని జ్యోతిష్య ఫలితాలు సాధారణ నమ్మకాలు, జ్యోతిష్య అంచనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన వాస్తవాలుగా పరిగణించకూడదు.