వాన వచ్చేముందు ఉసిళ్లు ఎందుకు కనిపిస్తాయి..? అసలు కారణం ఇదే..!

వానాకాలంలో రాత్రి వేళల్లో లైట్ల చుట్టూ ఉసిళ్లు గుంపులుగా కనిపించడం వెనుక శాస్త్రీయ కారణం ఉంది. గాలిలో తేమ పెరగడం, వాతావరణం అనుకూలంగా మారడంతో కొత్త కాలనీలు ఏర్పరచుకునేందుకు ఇవి బయటకు వస్తాయి. అయితే ఉసిళ్లు కనిపించాయంటే వెంటనే వర్షం పడుతుందని ఖచ్చితంగా మాత్రం చెప్పలేమని నిపుణులు సూచిస్తున్నారు.

వాన వచ్చేముందు ఉసిళ్లు ఎందుకు కనిపిస్తాయి..? అసలు కారణం ఇదే..!
Winged Termites

Updated on: Jul 13, 2026 | 5:42 PM

వానాకాలం ప్రారంభమయ్యే సమయంలో రాత్రి వేళల్లో ఇంటి లైట్ల చుట్టూ ఒక్కసారిగా ఉసిళ్లు గుంపులుగా ఎగురుతూ కనిపిస్తుంటాయి. వీటిని చూసి ఇప్పుడు వర్షం పడబోతోంది అని చాలా మంది భావిస్తారు. పూర్వకాలంలో టెక్నాలజీ అంతగా లేనప్పుడు మన పూర్వికులు ఇలాంటి సంకేతాలను అర్థం చేసుకుని ముందుకు సాగేవారు. తరతరాలుగా వస్తున్న ఈ నమ్మకానికి కొంత శాస్త్రీయ ఆధారం కూడా ఉంది.

ఉసిళ్లు అంటే రెక్కల చెదలు. ఇవి సాధారణంగా నేలలో లేదా చెక్కలో నివసించే చెదల కాలనీల నుంచి సంవత్సరంలో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే బయటకు వస్తాయి. వర్షాకాలానికి ముందు గాలిలో తేమ శాతం పెరగడం, ఉష్ణోగ్రతలు అనుకూలంగా మారడం, గాలి వేగం తగ్గడం వంటి పరిస్థితులు ఏర్పడితే ఇవి గుంపులుగా బయటకు వచ్చి ఎగురుతాయి. దీనినే శాస్త్రవేత్తలు స్వార్మింగ్ అని పిలుస్తారు. ఈ సమయంలో మగ, ఆడ ఉసిళ్లు జతకట్టి కొత్త కాలనీలు ఏర్పరచుకోవడానికి ప్రయాణం ప్రారంభిస్తాయి. అందుకే రాత్రి సమయంలో వీధి దీపాలు, ఇంటి లైట్లు, ఇతర వెలుతురు ఉన్న ప్రాంతాల వద్ద వేల సంఖ్యలో ఉసిళ్లు కనిపిస్తుంటాయి.

అయితే ఉసిళ్లు కనిపించాయంటే వెంటనే వర్షం పడుతుందని భావించడం సరైంది కాదు. గాలిలో తేమ పెరగడం, వాతావరణం వర్షానికి అనుకూలంగా మారడం వల్ల ఇవి బయటకు వస్తాయి. అందువల్ల కొన్ని గంటల్లో లేదా ఒకటి, రెండు రోజుల్లో వర్షం పడే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రతి సారి అలా జరుగుతుందని చెప్పలేం.

వాతావరణ మార్పులను గుర్తించడంలో ప్రకృతి కూడా కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఉసిళ్ల స్వార్మింగ్ కూడా అలాంటి సహజ సంకేతాల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే ఖచ్చితమైన వర్ష సూచన కోసం వాతావరణ శాఖ అంచనాలనే ఆధారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉసిళ్లు తినే సంప్రదాయం కూడా ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us