Weather report: ఉభయ రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. అత్యంత కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు.. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి..!

|

Dec 14, 2020 | 7:39 AM

తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో చలి పులి పంజా విసురుతోంది. ఉభయ రాష్ట్రాల్లో ప్రధానంగా ఏపీలోని విశాఖ ఏజెన్సీలో పరిస్థితి మరీ దారుణం అనే చెప్పాలి.

Weather report: ఉభయ రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. అత్యంత కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు.. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి..!
Follow us on

తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో చలి పులి పంజా విసురుతోంది. ఉభయ రాష్ట్రాల్లో ప్రధానంగా ఏపీలోని విశాఖ ఏజెన్సీలో పరిస్థితి మరీ దారుణం అనే చెప్పాలి. రాత్రి వేళ మరీ దారుణంగా 2, 3 డిగ్రీల కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ చలి తీవ్రంగా అధికంగా ఉంది. విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పినదాని ప్రకారం.. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక లంబసింగి‌లో అయితే దారుణంగా 1 నుండి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ చివరి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు తెలంగాణలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రజలను చలి నిద్రలేవనీయడం లేదు. బారెడు పొద్దెక్కినా ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి వణికిపోతున్నారు. అటవీ ప్రాంతాలు అధికంగా ఉన్న ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌‌ లలో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. తాజాగా నగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌లో 10.6 డిగ్రీల అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అక్కడ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం 9, 10 గంటల వరకు కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో 10.8, రంగారెడ్డి జిల్లా కాసులాబాద్‌లో 11.2, కొండారెడ్డిపల్లో 11.3, సంగారెడ్డి జిల్లాలోని కోహిల్‌లో 11.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరో మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వాతావరణ అధికారులు తెలిపారు.