
ఏపీలో బీభత్సం సృష్టిస్తున్న అర్నబ్ తుఫాన్ దెబ్బకు సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ తీరం దాటే సమయంలో ఏర్పడిన అలల తాకిడికి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ భారీ నౌక మార్గం తప్పి కోనసీమ జిల్లా అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చింది. వైజాగ్ పోర్టులో సరుకు అన్లోడ్ చేసుకుని కాకినాడ మీదుగా సింగపూర్ వెళుతున్న మార్షల్ ఐలాండ్స్కు చెందిన సిగ్మా పేరల్ కార్గో నౌక తుఫాన్లో చిక్కుకుంది. తుఫాన్ తీరం దాటే సమయంలో ఇంజిన్ ఫెయిల్ కావడంతో పాటు తీవ్రమైన సముద్ర ప్రవాహాలు, ఈదురుగాలుల తాకిడికి నౌక అదుపు తప్పి కేజీ బేసిన్ సమీపంలో సుమారు 130 నాటికల్ మైళ్ల దూరం కొట్టుకుపోయి చివరికి అంతర్వేది తీర ప్రాంతానికి చేరింది. సమాచారం అందుకున్న వైజాగ్ మెరైన్ అధికారులు, పోర్టు అథారిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై నౌక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాత నౌకను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు పశ్చిమ గోదావరి మొగల్తూరులో వైజాగ్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. తుఫాన్ కారణంగా అంతర్వేది దగ్గర చిక్కుకున్న నౌకను రెస్క్యూ చేసేందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు. మర్చంట్ షిప్లో 23 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బందిని రెస్క్యూ చేసేందుకు కోస్ట్‌గార్డ్ ప్రయత్నాలు ప్రారంభించారు. అంతేకాకుండా.. కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆ ప్రాంతంలో హెలిప్యాడ్ ను సిద్ధం చేస్తున్నారు.
సిగ్మా పెర్ల్.. మార్షల్ ఐ ల్యాండ్ షిప్.. సెల్ఫ్యూరిక్ యాసిడ్ లోడ్‌తో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దానిలో ఫిలిప్పీన్స్ సిబ్బంది ఉన్నట్లుగా చెబుతున్నారు. మొగల్తూరు పోలీసుల సాయంతో వైజాగ్ కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా.. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. అంతేకాకుండా.. అంబులెన్సులను, ఇతర వాహనాలను కూడా సిద్ధం చేశారు.