Vizag: విశాఖ రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదానికి రీజన్ ఇదే..

|

Aug 04, 2024 | 5:48 PM

ఆగి ఉన్న ట్రైన్‌లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది. అదే రన్నింగ్‌ ట్రైన్‌ అయి ఉంటే.. ఆ బర్నింగ్‌ ట్రైన్‌లో ఎంత ఘోరం జరిగి ఉండేది. నిలిచి ఉన్న రైల్లో...నిప్పు చెలరేగడం వెనుక ఉన్న నిజం ఏంటి? విశాఖను కలవర పెట్టిన కోర్బా ట్రైన్ ఇన్సిడెంట్‌ ఎలా జరిగింది?

Vizag: విశాఖ రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదానికి రీజన్ ఇదే..
Vizag Railway Station
Follow us on

విశాఖ రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ముందు బి7 బోగీలో మొదలైన మంటలు క్షణాల్లో బి6, బి8, ఎం1 బోగీలకు వ్యాపించాయి. స్టేషన్‌లోని 4వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఘటన జరిగింది. మొత్తం నాలుగు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపిన సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రైల్వే ప్రమాదంపై విశాఖ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్పాట్‌కు చేరుకొని పరిశీలించారు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చీ.

ఘటన జరిగిన సమయంలో రైల్లో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 10 గంటలకు బోగీల్లో మంటలు చెలరేగాయని, వెంటనే ట్రాక్‌ను క్లియర్‌ చేశామన్నారు జాయింట్‌ సీపీ పకీరప్ప. ఇక ట్రైన్‌లో నుంచి పొగ వస్తుండడాన్ని గమనించి…వెంటనే RPF సిబ్బందికి సమాచారం ఇచ్చాడు రాము అనే వ్యక్తి. దీంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే ప్రమాదతీవ్రత ఊహించని స్థాయిలో ఉండేది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

బీ7 బోగీలోని టాయిలెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రైలులో అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత డీఆర్‌ఎంతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అగ్ని ప్రమాదం ఘటన తర్వాత విశాఖ – తిరుమల ఎక్స్‌ప్రెస్‌కి మరో రేక్‌ను సిద్ధం చేశారు రైల్వే అధికారులు. ఉదయం కోర్బా ఎక్స్‌ప్రెస్‌గా విశాఖ చేరుకుని.. మధ్యాహ్నం తిరుమల ఎక్స్‌ప్రెస్‌గా బయలుదేరింది ట్రైన్‌. స్టేషన్‌లో నిలిచి ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అదే మార్గం మధ్యలో అయితే తీవ్ర నష్టం జరిగేదంటున్నారు ప్రయాణికులు. అగ్ని ప్రమాదంపై రైల్వే అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..