
విశాఖపట్నంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే వైజాగ్ జూపార్క్ పరిసర ప్రాంతం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. ఆరవాల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మిస్టరీ వెలుగుచూసింది.
విశాఖ వ్యాలీ స్కూల్ నుంచి జూపార్క్‌కు వెళ్లే దారిలో పొదల మధ్య అనుమానాస్పదంగా ఒక నీలం రంగు గోనెసంచి కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని సంచి విప్పి చూడగా… లోపల కుళ్లిన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మృతదేహం బయటపడింది. మృతుడి శరీర భాగాలపై ఉన్న గుర్తులు చూస్తుంటే ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తలపై తీవ్రమైన గాయాలున్నాయి. కుడి భుజం, తలపై ఓ భారీ వాహనం వెళ్లిన టైరు గుర్తులున్నాయి. అలాగే చేతులు, కాళ్లకు నల్లటి గ్రీస్ మరకలు కనిపిస్తున్నాయి. దీంతో మృతుడు ఆటోమొబైల్ వర్కర్ లేక క్లీనర్ అయి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక అంచనాకొచ్చారు. జూపార్క్‌తో పాటు నేషనల్ హైవే పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
ఎక్కడో హత్య చేసి బాడీని ఇక్కడ పడేశారా…? లేక అర్ధరాత్రి వేగంగా వచ్చిన ఏదైనా వాహనం తొక్కేయడంతో చనిపోతే… ఆ ప్రమాదాన్ని దాచడానికి శవాన్ని సంచిలో కట్టి ఇక్కడ విసిరేశారా…? అన్న కోణంలోనూ అరిలోవా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మరి చూడాలి పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలుతుందో…!