
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించింది. సుమారు పది రోజుల క్రితం ఓ యువతిని దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీటిపిఎస్ కూలింగ్ కెనాల్‌లో పడేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
కూలింగ్ కెనాల్‌లో లభించిన మృతదేహ భాగాలపై పోలీసులు విచారణ చేపట్టగా.. మృతురాలు మంగళగిరికి చెందిన కళ్యాణిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఓ వ్యాపారి అందించిన సమాచారంతో పోలీసులు మృతురాలి వివరాలను నిర్ధారించుకున్నట్లు వెల్లడించారు.
కళ్యాణి హత్య వెనుక వ్యక్తిగత సంబంధాలు కారణమై ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగిందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ముందు కళ్యాణి ఎవరితో కలిసి నివసించింది? ఆమెకు ఎవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి? చివరిసారిగా ఎవరితో సహజీవనం చేసింది? అనే వివరాలను సేకరిస్తున్నారు.
కళ్యాణిని నిందితులు అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాళ్లు, చేతులు, మొండెం, తలను వేర్వేరు భాగాలుగా చేసి కూలింగ్ వీటి పిఎస్ కూలింగ్ కెనాల్‌లో పడేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. మృతదేహాన్ని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారినప్పటికీ.. చేతిపై ఉన్న ప్రత్యేక గుర్తు కేసులో కీలక ఆధారంగా మారింది.
కళ్యాణి ఎవరితో చివరిగా మాట్లాడింది, ఆమె ఫోన్ కాల్స్, పరిచయాలు, నివాస వివరాలు వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. హత్యకు పాల్పడిన వ్యక్తులు లేదా వ్యక్తులను గుర్తించేందుకు వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..