Tomato Price: ఊరించి.. ఉసూరుమనిపించింది.. ఒక్కసారిగా టమోటా ధరలు ఢమాల్‌.. మార్కెట్ రేటు ఎంతో తెలుసా..

| Edited By: Anil kumar poka

Nov 29, 2021 | 5:58 PM

అమ్మబోతే అడివి, కొనబోతే కొరివిలా తయారయ్యింది టమాట ధరల పరిస్థితి. నిన్నటి వరకూ రాకెట్‌ వేగంతో అంతరిక్షంలోకి దూసుకెళ్ళిన టమాట ధరలు, నేడు అధఃపాతాళంలో కూరుకుపోయి రైతులను ఠారెత్తిస్తున్నాయి.

Tomato Price: ఊరించి.. ఉసూరుమనిపించింది.. ఒక్కసారిగా టమోటా ధరలు ఢమాల్‌.. మార్కెట్ రేటు ఎంతో తెలుసా..
Tomato Price Down
Follow us on

Tomato Price Down: ఊరించి.. ఉసూరుమనిపించింది.. ఆకాశాన్నంటిన ధరలు ఒక్కసారిగా ఢమాల్‌మన్నాయి. నింగి నుంచి నేలమీదికొచ్చేశాయి. ఒక్కరోజులోనే 130 నుంచి 30కి చేరింది కిలో టమోటా ధర. మంచి ధర వస్తుందని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిల్చింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్‌లో అమాంతం పడిపోయింది టమోటా ధర. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతయ్యే పరిస్థితి నుంచి ఇతర రాష్ట్రాల నుంచే ఇక్కడికి దిగుమతి అవుతోంది టమోటా. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలనుంచి టమోటా రావడంతోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ధర.

ఇక ఇటు కర్నూలు ఆస్పరి కూరగాయల మార్కెట్లోనూ భారీగా తగ్గింది టమోటా ధర. 25 కిలోల బాక్స్ 750 రూపాయలు పలికింది. రెండ్రోజుల క్రితం 150 రూపాయలు పలికిన రేటు..ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. ఐతే టమోటా ధరలు దిగి వస్తుంటే..మిగిలిన కూరగాయల ధరలు మాత్రం పైపైకి పోతున్నాయి. అనంతపురం జిల్లాలో టమోటా ధరలు ఇలా ఉన్నాయి.

పతనానికి కారణమేంటి..?

అన్నేసి చూడు, నన్నేసి చూడు అందట ఉప్పు. ఎందుకంటే ఆ ఉప్పు పడందే దేనికీ రుచి రాదు. కానీ నిజానికి ఆమాట అనాల్సింది టమాట. కూరగాయల్లో రారాజు అవునో కాదో కానీ, అది లేందే కూరకు రుచి రానేరాదు. అలాంటి టమాటా ధరలు నిన్నటి వరకూ వినియోగదారులకు చుక్కలు చూపించాయి. కానీ యిప్పుడేమో రైతు కంట కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి ఈ మాయదారి టమాటాలు. ఇంతకీ ఈ టమాట ధరల పతనానికి కారణమేంటి? మొన్న 150 రూపాయలు పలికిన టమాట ధర ఠారెత్తించింది. నేడు పట్టుమని పాతిక రూపాయల్లేని రేటు రైతులను బావురుమనిపిస్తోంది.

అన్నింటా తానుండే టమాటా ధర ఇన్నాళ్ళూ ఠారెత్తించింది. గత చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో అక్షరాలా 150 రూపాయలు పలికింది. చుక్కలెక్కి కూర్చున్న టమాట పేరుని పన్నెత్తి పలికే సాహసం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే అది నిన్నటి మాట. మరిప్పుడో? కష్టపడి పండించిన పంటకు మంచి ధర పలికి ఈయేడాదైనా గట్టెక్కుతామనుకుంటోన్న రైతన్నల ఆశలు చప్పున చల్లారాయి. ఆకాశాన్నంటిన టమాట ధరలు అమాంతం కుప్పకూలిపోయాయి.

రాకెట్‌ వేగంతో దూసుకెళ్ళిన టమాట పేలని టపాసులా చప్పున చల్లారిపోయింది. టమాటా మళ్లీ పతనం దిశగా పరుగులు తీస్తోంది. మూడు రోజుల క్రితం మదనపల్లి మార్కెట్‌లో అత్యధికంగా 140 రూపాయలు. నేడు అదే చిత్తూరు జిల్లా ములకల చెరువు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కిలో 20కు చేరిన టమాట ధర.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఇలాంటివారితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి.. చాణక్యనీతిలో సంచలన విషయాలు..

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే తెలుసా.. ఇది ఎక్కడ ప్రారంభమైంది.. భారతదేశంలో ఎప్పుడు వచ్చింది..