ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజు తిప్పాయపల్లె శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. దశాబ్దాల నుంచి వస్తున్న ఆచారాన్ని గ్రామ ప్రజలు అత్యంత భక్తి, శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. విదేశాలు, ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడో స్థిరపడి వారంతా కూడా గ్రామానికి వచ్చి ఆచారం పాటిస్తారు. ఈ వేడుకల్లో మహిళలకు ప్రవేశం లేదు. స్వామి వారికి చేసే పొంగళ్ల ప్రసాదాలలో ఆడవారి ప్రమేయం అస్సలు ఉండకూడదు.
ఇక్కడి ఆచారం ప్రకారం గ్రామంలోని మగవాళ్లు తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి, పట్టు వస్త్రాలు ధరించి పొంగళ్ల ప్రసాదాలు తయారు చేసేందుకు కావల్సిన సామాగ్రి అంతా తీసుకొని వెళ్లి పొంగళ్లు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మగవారు చేసిన ఈ ప్రసాదాలను ఆడవారు తినకూడదు.
దశాబ్దాల క్రితం గ్రామం కరువు బారిన పడిందట. జనమంతా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారంట. పశువులు సైతం మృతి చెందాయట. దీంతో గ్రామానికి వచ్చిన సాధువు ఆంజనేయస్వామికి ఆలయం నిర్మించి మగవాళ్లు మాత్రమే స్వయంగా స్వామికి పొంగళ్ల రూపంలో ప్రసాదం చేసి నైవేద్యంగా సమర్పించాలని చెప్పారట. ఇందులో స్త్రీల పాత్ర అస్సలు ఉండకూడదు. మగవారు వండిన ప్రసాదాలను కూడా ఆడవారు తినకూడదు. అప్పటి నుంచి గ్రామస్తులు సాధువు చెప్పిన సంప్రదాయాలను పాటిస్తున్నారు. ఈ ఆచారాలు పాటిస్తున్న కారణంగా తన గ్రామ బాగుందని జనం విశ్వసిస్తున్నారు.
ఇలా సూచనలు చేసిన సాధువు ఆయన చెప్పి, ఆలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పుట్టు శిలపైన బీజాక్షరాలు రాసి , అందరూ చూస్తుండగానే ఆ సాధువు మాయమైపోవడంతో ఆ సాధువే ఆంజనేయస్వామని గ్రామ ప్రజలు నమ్మి ఆయన చెప్పిన విధంగా గ్రామ ప్రజలు చేయడంతో కరువు కాటకాలు నుండి బయటపడి ఎలాంటి జబ్బులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించారని , అందువల్ల తమని అనేక రోగాల నుంచి కాపాడినటువంటి ఆంజనేయస్వామిని సంజీవరాయ స్వామిగా కొలుచుకుంటూ బీజాక్షరాలు రాసిన ఆంజనేయ స్వామి శిలను అత్యంత భక్తినిస్తులతో ఈ ఆచారంతో నేటికీ గ్రామ ప్రజలు పూజిస్తున్నారు. ఈ రోజున ఆ గ్రామంలో పిల్లలు , పెద్దలు అని తేడా లేకుండా చుట్టుపక్క గ్రామాల నుండి పెద్ద ఎత్తున వైభవంగా పండగను తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి