తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు.. క్రిస్మస్ పండుగకు కొత్త సినిమాలతో..

|

Dec 20, 2020 | 5:48 AM

తెలుగు రాష్ట్రాల్లో ఇక సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. కరోనా వల్ల కొన్ని రోజులు థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు.. క్రిస్మస్ పండుగకు కొత్త సినిమాలతో..
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఇక సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. కరోనా వల్ల కొన్ని రోజులు థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వం సినిమా థియేటర్ల ప్రారంభానికి అనుమతులు కూడా ఇచ్చింది. కానీ నిర్వహణ చార్జీల విషయంలో కొన్ని రోజులుగా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు వివాదం నడుస్తోంది. అందుకే థియేటర్ల రీ ఓపెన్ ఆలస్యమైంది. తాజాగా ఇరు శాఖల మధ్య సమస్యలు ముగిసిపోవడంతో థియేటర్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కొత్త సినిమాలతో థియేటర్లను ప్రారంభిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ నెలలో విడుదలయ్యే కొత్త సినిమాలకు వీపీఎఫ్ చార్జీలు కూడా రద్దు చేస్తున్నట్లు మండలి తెలిపింది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో విడుదలయ్యే సినిమాలకు డిజిటల్ ఛార్జీల్లో 40 శాతం నిర్మాతలే చెల్లిస్తారని తెలిపింది. డిజిటల్ ఛార్జీల సర్వీసుల విషయంలో వచ్చే ఏడాది మార్చి 31 లోపు ఒప్పందం జరిగే అవకాశం ఉందని తెలుగు నిర్మాతల మండలి పేర్కొంది. మల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. వర్చువల్ ప్రింట్ ఫీజుతోపాటు ఆదాయంలో వాటాల విషయంలో యజమానులు దిగిరాకపోవడం వల్ల నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాట వినకపోతే కొత్త సినిమాలను విడుదల చేయమని తెగేసి చెప్పారు. దీంతో అటు నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య నెలకొన్న వివాదం సినీ పరిశ్రమను మరోసారి గందరగోళంలో పడేసింది. ఈ క్రిస్మస్ పండగతోపాటు వచ్చే సంక్రాంతికి విడుదల కావల్సిన సినిమాలపై సందిగ్ధత నెలకొంది. అయితే నిర్మాత మండలి తాజా నిర్ణయంతో క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కొత్త సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది.