Andhra Pradesh: ఆడ బిడ్డ విక్రయం కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు.. కేజీహెచ్‌లో తేలిన డొంకా..!

| Edited By: Balaraju Goud

Aug 15, 2024 | 1:00 PM

విశాఖలో కలకలం రేపిన ఆడ శిశువు విక్రయం కేసులో తొమ్మిది మందిని త్రీ టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆడ శిశువు తండ్రితోపాటు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Andhra Pradesh: ఆడ బిడ్డ విక్రయం కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు.. కేజీహెచ్‌లో తేలిన డొంకా..!
Child
Follow us on

విశాఖలో ఆడ శిశువు విక్రయం కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేజీహెచ్ కేంద్రంగానే ఈ వ్యవహారం సాగినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని ఓ ముఠా ట్రాప్ చేసినట్టు బయటపడింది. పోలీసులు అరెస్టు చేసిన 9మంది నిందితుల్లో ఇద్దరు కేజీహెచ్‌తోనే సంబంధాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ అనేక సార్లు శిశువుల అపహరణాలు కేసులతో కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం పాత్ర బయటపడింది. తాజా కేసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేశారు విశాఖ పోలీస్ కమిషనర్. కేజీహెచ్ భద్రతపై వైద్యాధికారులకు కీలక సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయినిగా ఉన్న కేజీహెచ్ లో కొంతమంది సిబ్బంది బ్రోకర్లుగా అవతారం ఎత్తడం అప్రతిష్ట మూటగట్టుకుంటుంది.

విశాఖలో కలకలం రేపిన ఆడ శిశువు విక్రయం కేసులో తొమ్మిది మందిని త్రీ టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆడ శిశువు తండ్రితోపాటు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను రంగంలోకి దింపారు విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్చి.

కంచరపాలెం కప్పరాడ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ ఐదు నెలల కిందట ప్రసవం కోసం కేజీహెచ్‌లో చేరింది. ఆ సమయంలో వైద్యులు స్కానింగ్‌ చేయాల్సి ఉండడంతో ఆస్పత్రి ఆవరణలోని డయాగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ వార్డు బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. దంపతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు గుర్తించాడు. పుట్టబోయే బిడ్డను విక్రయించాలని వారిని ట్రాప్ చేశాడు. విక్రయిస్తే పది లక్షల రూపాయల వరకూ వస్తాయని ఆశ చూపించాడు. తొలుత తటపటాయించినప్పటికీ.. ఆర్థిక ఇబ్బందుల తోపాటు, అనారోగ్య కారణలతో శిశువును విక్రయించేందుకు ఆలోచన చేయక తప్పలేదు. దానికి తోడు ఎప్పటికప్పుడు బిడ్డ తల్లిదండ్రులకు కాల్స్ చేసి ట్రాప్ చేయడంతో వీళ్ళ మాటలు విని డబ్బుల కోసం, పేదరికం నేపథ్యంలో శిశువు అమ్మగారికి పెట్టారు.

కేజీహెచ్ లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న తన స్నేహితుడికి విషయం చేరవేశాడు వార్డు బాయ్. టెక్నీషియన్, వార్డు బాయ్ కలిసి.. అప్పటికే ఓ పార్టీని రెడీ చేసి పెట్టారు. పదేళ్లుగా సహజీవనం చేస్తూ, పిల్లలు లేని దంపతులకు శిశువు సిద్ధంగా ఉందని సమాచారం అందించారు. రాంబిల్లి ప్రాంతానికి చెందిన దంపతులకు సమాచారం ఇచ్చారు. తమ వృద్ధాప్యంలో బాగోగులు చూసేందుకు బిడ్డ అవసరమని శిశువును కొనుగోలు చేసేందుకు వాళ్ళు సిద్ధమయ్యారు. ఆస్పత్రిలో ఉండగా శిశువును విక్రయిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని మరో ప్లాన్ వేశారు. కొన్నాళ్ల తర్వాత శిశువును తీసుకువెళ్లేలా ఇరువర్గాలకు మధ్యవర్తుల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు.

అంతర్గత ఒప్పందం ప్రకారం శిశువుకు ఐదు నెలలు రావడంతో ఆస్పత్రి డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ టబోయ్, ల్యాబ్‌ టెక్నీషియన్‌లు ఆడశిశువు తల్లిదండ్రులను సంప్రదించారు. శిశువును విక్రయించేందుకు తల్లి తటపటాయించడంతో ఆమె ఆడపడుచుతోపాటు మరికొందరు కుటుంబసభ్యుల ద్వారా మధ్యవర్తులు ఒప్పించారు. దీంతో రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. శిశువును అప్పగించి.. డబ్బులు తీసుకునేందుకు ఐదేళ్ల శిశువును తీసుకుని దంపతులు, ఆడపడచు, ఇద్దరు మధ్యవర్తులు మరో ఐదుగురు కలిసి సిరిపురం సమీపంలోని హార్బర్‌ పార్క్‌ వద్దకు చేరుకున్నారు. ఏడున్నర లక్షల రూపాయలకు శిశువును విక్రయించేందుకు ఒప్పందం కుదరడంతో చెక్కు ద్వారా ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు కొనుగోలుదారులు సిద్ధమయ్యారు.

అదే సమయంలో విశాఖ పోలీస్ కమిషనర్ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇవ్వడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ద్వారా స్పెషల్ ఆపరేషన్‌ నిర్వహించారు. బ్రోకర్లు, శిశువుతోపాటు తల్లిని మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని త్రీ టౌన్‌ పోలీసులకు అప్పగించారు. శిశువును తొలుత శిశుగృహకు తరలించారు. అయితే శిశువుకు వైద్య చికిత్స అవసరం కావడంతో అక్కడి నుంచి తల్లితోపాటు కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు శిశువు భర్త సహా తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రెండు చెక్‌లు, ఆరు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌ నిమిత్తం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో మరికొందరు నిందితుల పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు విశాఖ సీపీ బాగ్చి.

గతంలోనూ అనేక మార్లు శిశువుల విక్రయాలు అపహరణ ఘటనలు.. విశాఖ కేజీహెచ్ కేంద్రంగానే జరిగాయి. తాజా ఘటన కేజీహెచ్ బయట జరిగినప్పటికీ, కేజీహెచ్‌లోనే శిశువు అభిప్రాయంపై మాటలు జరగడం, ప్రధాన నిందితుల ఇద్దరూ కేజీతోనే సంబంధాలు ఉండడం మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. అయితే.. కేజేస్ లో ఎటువంటి వ్యవహారాలపై గట్టిగా పెట్టామని అంటున్నారు అధికారులు. ఐదు నెలల క్రితం కేజీహెచ్ లో శిశువు జన్మించిందని, ఆ శిశువు తల్లి బిడ్డను బంధువులు తీసుకెళ్లిపోయారని చెప్పారు సూపరిండెంట్ శివానంద. బయట జరిగిన వ్యవహారాలతో కేజిఎస్ కు సంబంధం లేదని అంటున్నారు. అయినప్పటికీ ఇటువంటి వ్యవహారాలపై ప్రత్యేక దృష్టిసారించామని, పిల్లల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

మరోవైపు.. తాజా ఘటన నేపథ్యంలో సీపీ బాక్చి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజిహెచ్ వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. వైద్య విద్యార్థులు కూడా సమావేశానికి హాజరయ్యారు. శిశువుల అపహరణాలు, నవజాత శిశువుల రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను వివరించారు. సీసీ కెమెరాలతో పాటు భద్రత కట్టుదిట్టం చేయడం వంటి చర్యలు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మరింత మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని అవసరమైతే పోలీసుల ద్వారా శిక్షణా అందిస్తామని చెప్పారు సిపి. ఒక పోలీసు ను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డ తెలిస్తే 7995095799 నెంబర్‌కు తెలియజేయాలని సూచించారు.

మొత్తం మీద.. తాజాగా ఆడ శిశువు విక్రయ ఘటన విశాఖను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తల్లిదండ్రుల పేదరికాన్ని, అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న కొంతమంది బ్రోకర్లు.. బిడ్డను అమ్మేలా వారిని ప్రోత్సహించి సొమ్ము చేసుకుంటున్నారు. కేజీహెచ్ కేంద్రంగానే అటువంటి వ్యవహారాలు జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఉత్తరాంధ్రకే పెద్దదిక్కుగా ఉన్న కేజీహెచ్ కు కొందరి వల్ల అప్రతిష్ట మూట గట్టుకుంటుంది. ఇప్పటికైనా వైద్యాధికారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారించి ఇటువంటి కలుపు మొక్కలను ఏరి పారేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..