Andhra Pradesh: హాస్టల్ బాత్రూమ్‌లో ప్రసవించిన బాలిక కేసులో విస్తుపోయే వాస్తవాలు.. !

| Edited By: Balaraju Goud

Aug 03, 2024 | 9:47 PM

ప్రకాశం జిల్లాలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న 16 ఏళ్ళ బాలిక గర్భం దాల్చింది. అంతేకాదు తాను చదువుకుంటున్న హాస్టల్‌ బాత్రూమ్‌లో ప్రసవించిన కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ పేరుతో ఒకరు, బెదిరించి మరొకరు, డబ్బుల ఆశచూపి ఇంకొరు ఆమెపై లైంగిక దాడి చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

Andhra Pradesh: హాస్టల్ బాత్రూమ్‌లో ప్రసవించిన బాలిక కేసులో విస్తుపోయే వాస్తవాలు.. !
Hotel Girl
Follow us on

ప్రకాశం జిల్లాలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న 16 ఏళ్ళ బాలిక గర్భం దాల్చింది. అంతేకాదు తాను చదువుకుంటున్న హాస్టల్‌ బాత్రూమ్‌లో ప్రసవించిన కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ పేరుతో ఒకరు, బెదిరించి మరొకరు, డబ్బుల ఆశచూపి ఇంకొరు ఆమెపై లైంగిక దాడి చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. బాలిక స్వగ్రామంలో జరిగిన ఈ దారుణానికి బాలిక గర్భం దాల్చింది. భయంతో బాలిక ఎవరికీ చెప్పకపోవడంతో 8 నెలలు గర్భాన్ని మోసిన తరువాత తన హాస్టల్‌లోని బాత్రూమ్‌లో శిశువుకు జన్మనిచ్చింది. శిశువు మరణించడంతో మార్చూరీకి తరలించారు. బాధితురాలికి వైద్యం అందించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు యువకులను ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారు.

ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్‌..

ప్రకాశం జిల్లాలోని ఓ కస్తూర్బా గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక బాత్రూమ్‌లో ప్రసవించిన ఘటనపై కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సీరియస్‌గా స్పందించారు. పాఠశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్‌ ప్రత్యేకాధికారి వి.అరుణకుమారి, ఏఎన్‌ఎం జె.సత్యవతిని సస్పెండ్‌ చేస్తూ డీఈవో సుభద్ర ఉత్తర్వులు జారీచేశారు. విద్యాలయంలో విద్యార్థిని గర్భంతో ఉంటే గుర్తించలేకపోవడానికి పాఠశాల ప్రత్యేక అధికారి అరుణకుమారి నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. అలాగే కేజీబీవీలో ఔట్‌సోర్సింగ్‌పై ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న జె.సత్యవతి ప్రతిరోజూ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉండగా, పాఠశాలలో బాలిక గర్భంతో ఉన్నప్పటికీ గుర్తించకపోవటంపై ఆమెను కూడా ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. మరోవైపు విద్యార్దిని గర్భం దాల్చడానికి దారితీసిన పరిస్థితులపై పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ట్రంక్ పెట్టెలో మృత శిశువు…

కస్తూర్బా గురుకుల బాలికల ఆశ్రమ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న ఓ బాలిక రెండు రోజుల క్రితం బాత్రూమ్‌లో ప్రసవించింది. ఈ వ్యవహారంపై అధికారులు సీరియస్‌గా స్పందించారు. వెంటనే బాలికను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. బాలిక క్యాంపస్‌లోని బాత్‌రూమ్‌లోనే ప్రసవించింది. ఆ తర్వాత భయపడి రెండు మూడు గంటలపాటు బాత్రూమ్‌లోనే ఉండిపోయింది. స్టడీ అవర్‌లో బాత్రూమ్‌లోకి వెళ్ళిన బాలిక ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు బాత్‌రూమ్‌లోకి చూడటంతో బాలిక ప్రసవించిన విషయం వెలుగులోకి వచ్చింది. పుట్టిన శిశువు చనిపోవడంతో ఓ ట్రంక్‌ పెట్టెలో ఆ శిశువును బాలిక పెట్టిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

స్వగ్రామంలోనే కామాంధులు…

బాధిత బాలికను తన స్వగ్రామంలోని సైదాబాబు అనే యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి వ్యవహారాన్ని గమనించిన గ్రామానికే చెందిన శ్రీనివాసులురెడ్డి, వెంకటరెడ్డి అనే ఇద్దరు యువకులు బాలికను బెదిరించారు. తరువాత డబ్బుల ఆశకూడా చూపి, బాలికపై లైంగిక దాడి చేశారు. ఈ క్రమంలో గర్భం దాల్చిన బాలిక భయంతో తల్లిదండ్రులతో ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోయింది. గర్భవతిగా ఉండగానే జూన్‌ 19వతేదీన కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో చేరింది.

బాత్‌రూమ్‌లోకి వెళ్ళిన బాలిక ఎంతకీ తిరిగి రాకపోవడంతో..

ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరిన ఆ బాలిక అప్పటికే గర్భవతిగా ఉందన్న విషయాన్ని అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు గుర్తించలేకపోయారు. కాలేజిలో చేరిన తర్వాత వారంరోజుల పాటు హోమ్‌సిక్‌ పేరుతో ఇంటికి వెళ్ళిన బాలిక, ఇటీవల తిరిగి వచ్చింది. యథావిధిగా రోజూ తరగతులకు హాజరవుతోంది. అప్పుడు కూడా బాలికపై ఎవరికీ అనుమానం రాలేదు. ఈ నేపధ్యంలో రెండు రోజుల క్రితం ఆగస్ట్ 1, బుధవారం ఉదయం 11గంటల సమయంలో బాత్‌రూమ్‌లోకి వెళ్ళిన బాలిక ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్ధినులు బాత్రూమ్‌లో పరిశీలించారు. అప్పటికే బాలిక ప్రసవించి, శిశువు చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.

పోలీసుల విచారణలో సంచలనాలు..

ఈ విషయాన్ని స్థానిక మహిళా పోలీసు ద్వారా కొత్తపట్నం పోలీసులకు తెలియచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో బాలిక స్వగ్రామానికి చెందిన సైదాబాబు ప్రేమ పేరుతో, అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులురెడ్డి, వెంకటరెడ్డిలు బెదిరించి, డబ్బుల ఆశచూపి లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడినట్టు తేల్చారు. ముగ్గురు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్టు జిల్లా ఎస్‌పీ ఎఆర్‌ దామోదర్‌ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..