
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రాప్తాడు దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యంపై మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్నారు. తాజాగా బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి లోకేష్ వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్యులు బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్టు మంత్రికి తెలిపారు. బాలిక చాలా స్పీడ్‌గా కోలుకుంటుందని.. త్వరలో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. దీంతో వైద్య బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హేమంత్ ఆరోగ్యం విషమించడంతో ఇటీవల అతన్ని కర్నూలు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం అతని ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్య పరీక్షల తర్వాత అతన్ని అనంతపురం జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం హేమంత్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో హేమంత్‌ను అనంతపురం జైలుకు తరలించారు పోలీసులు.
అసలేంటి ఈ కేసు
అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న బాలికపై హేమంత్ అనే యువకుడు రంపంతో దాడికి పాల్పడ్డాడు. బాలిక స్కూల్‌లో ఉండగా రంపం తీసుకొని క్లాస్‌లోకి చొరబడిన నిందితుడు దానితో బాలికపై దాడి చేశాడు. ఈ దాడిలో బాలికతో పాటు నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితురాలు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌కు తరలించారు.
ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులపైనే కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అతని కుడి కాలికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతని కాలికి రక్త ప్రసరణ ఆగిపోవడంతో శస్త్రచికిత్స చేసి కుడి కాలిని పూర్తిగా తొలగించారు. తాజాగా అతను కోలుకోవడంతో కోర్టులో హాజరుపరచగా అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతను అనంతపురం జైలులో ఉన్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.