AP News: బాబోయ్.! ఇదేం మాయబజార్ సామీ.. కల్తీ పప్పుతో చిత్తవుతున్న జనాలు..

|

Aug 12, 2024 | 6:00 PM

మాంసాహారంతో పోల్చితే పప్పుల్లో ఎక్కువ ప్రోటిన్లు ఉంటాయని డాక్టర్లు చెప్తూ ఉంటారు. చికెన్, మటన్‌ వంటి నాన్‌వెజ్‌ తినని వారు ప్రోటిన్‌ కోసం తమ భోజనంలో పప్పులు చేర్చుకోవాలని సూచిస్తూ ఉంటారు. కాని బలాన్ని అందించాల్సిన పప్పు ఇప్పుడు మనుషులను పిప్పి చేస్తోంది. కొన్ని రకాల పప్పుల్లో జరుగుతున్న కల్తీ మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ఇంతకీ ఆ పప్పేంటి? దాని వల్ల మనుషులకు కలిగే ముప్పేంటి? ఇప్పుడు చూద్దాం.

AP News: బాబోయ్.! ఇదేం మాయబజార్ సామీ.. కల్తీ పప్పుతో చిత్తవుతున్న జనాలు..
Ap News
Follow us on

కల్తీ, కల్తీ, కల్తీ- పాలలో కల్తీ, నూనెలో కల్తీ, బియ్యంలో కల్తీ, పప్పులో కల్తీ- కాదేది కల్తీకి అనర్హమన్నట్టు ప్రపంచం ఉంది. హోటల్స్‌ కల్తీ ఎలా జరుగుతోందనన్నది గత కొన్ని రోజులుగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. హోటల్‌ ఫుడ్‌ అంటే జనం భయపడే పరిస్థితి వచ్చింది. మరి వండుకునేందుకు తెచ్చే బియ్యం, పప్పు వంటివి స్వచ్ఛమైనవేనా అంటే జవాబు వినేందుకు గుండె దిటువు చేసుకోవాల్సిందే. సాధారణ కుటుంబాల్లో వారానికి కనీసం రెండుసార్లైన పప్పు వండుతారు. హాస్టల్స్‌, మెస్‌ల్లో అయితే పప్పు డైలీ ఉంటుంది. దుకాణం నుంచి తెచ్చుకునే పప్పులో భయంకరమైన పప్పు మిక్స్ అయిపోతోంది. ఆ పప్పు వండుకొని ఇంట్లో లొట్టలు వేసుకుని పిల్లలతో సహా భోంచేసేస్తున్నాం. కల్తీ గురించి తెలియక పప్పు హెల్తీ అని నమ్మి దాన్ని పిల్లలు చాలా మంది తల్లులు తినిపిస్తుండటం మనకు తెలిసిందే.

కల్తీ పదార్థాలు, హానికరమైన ఆహారాన్ని నియంత్రించేందుకు విశాఖపట్నంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా హాస్టల్స్‌ వంటకాలపై నిఘా పెట్టారు. ప్రైవేట్‌ హాస్టల్స్‌లో ఆహార తయారీని పరిశీలిస్తున్నారు. చాలా చోట్ల కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని విషయం తేటతెల్లమైంది. విశాఖలోని MVP కాలనీలో కోచింగ్ సెంటర్లు, కాలేజీలు, ఆఫీసుల సంఖ్య చాలా ఎక్కువ. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎక్కడికెక్కడి నుంచి వచ్చి ఇక్కడి హాస్టల్స్‌లో ఉంటారు. వీళ్ల కోసం ఇక్కడ హాస్టల్స్‌ కూడా భారీగానే వెలిశాయి. ఈ హాస్టల్స్‌లో వడ్డించే ఆహారంలో కనీస నాణ్యత ఉండటం లేదని ఫిర్యాదులు రావడంతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వాటిపై దృష్టి పెట్టారు. ఈ హాస్టల్స్‌లో ఉపయోగిస్తున్న కందిపప్పు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటి శాంపిల్స్ సేకరించారు. వాటిని హైదరాబాద్‌లోని స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌కు పంపించారు. 12 రోజుల తర్వాత ల్యాబ్‌ నుంచి నివేదిక వచ్చింది. అందులో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. హాస్టల్స్‌లో ఉపయోగిస్తున్న కందిపప్పులో కేసరి పప్పు కలిసినట్టు బయటపడింది. ఆ పప్పును ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారో గుర్తించి, ఆ షాపుపై అధికారులు దాడి చేశారు. విశాఖ డబుల్ల్ రోడ్డులోని కిరాణా దుకాణం నుంచి కొంటుంటున్న తెలియడంతో ఆ షాపులో స్టాక్‌ పరిశీలించారు. అక్కడ నిల్వ ఉన్న పప్పు స్వాధీనం చేసుకున్నారు. ఆ దుకాణాన్ని ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టి అక్కడ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ గోదాములో ఉన్న కేసరి పప్పుతో కల్తీ అయిన 40 బస్తాల కందిప్పు సీజ్‌ చేశారు.

వాస్తవానికి కందిపప్పులా ఉండే కేసరి పప్పులో ప్రోటిన్లు చాలా అధికంగా ఉంటాయి. ఏ వాతావరణంలోనైనా పండటం ఈ పప్పు ప్రత్యేకత. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అందించే పంటల్లో ఇది ఒకటి. ఒకప్పుడు ఈ కేసరి పప్పును ఆహారంలో వినియోగించేవారు. ధర తక్కువ కావడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో దీనికి ఆదరణ బాగా ఉండేది. కాలక్రమంలో ఈ పప్పు తింటున్న వారిలో నరాల బలహీనత, నడుము కింది భాగం చచ్చుబడిపోవడం, పక్షవాతం, తిమ్మరి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో దీనిపై ICMR పరిశోధన చేపట్టింది. లెథరిజం అనే ఒక రకమైన నరాల జబ్బుకు ఈ పప్పే కారణమని తేల్చారు. ఈ పప్పులో ఉండే డీ-అమినో ప్రో పియోనిక్‌ యాసిడ్‌ కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ICMR పరిశోధనలో తేలింది. దీంతో 1961లో ఈ కేసరి పప్పును ప్రభుత్వం నిషేధించింది. కేసరి పప్పు పండించే రైతులు నష్టపోతుండటం, వారి జీవనంపై ప్రభావం చూపడంతో ప్రత్యామ్నాయాల అభివృద్ధి జరిగింది. ఈ కృషి కారంగా మసూర్‌ దాల్‌ లాంటి పప్పు రకాలు ప్రాచుర్యం పొందాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన నియంత్రణా చర్యల కారణంగా కేసరి పప్పులో హానికారక పదార్థాల స్థాయి తగ్గించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. 2008లో ఈ పప్పుపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. అయితే ఈ పప్పును కేవలం పశుగ్రాసానికి మాత్రమే ఉపయోగించాలని, మానవ వినియోగానికి ఎగుమతులు, అమ్మకాలు చేయకూడదని ఆదేశించింది. కాని దొంగదారిలో ఇది సాధారణ కందిపప్పులో కల్తీ అయిపోయి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిపోయింది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..