
అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రకృతి సృష్టించే వింతలు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి అరుదైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చోటుచేసుకుంది. సాధారణంగా కొబ్బరికాయ నుంచి కొబ్బరి మొక్క మొలకెత్తడం చూస్తుంటాం. కానీ ఇక్కడ కొబ్బరికాయ నుంచి రావిచెట్టు మొలక రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
అమలాపురంలోని మొబర్లిపేట బ్రహ్మానందం వీధిలో శ్రీనివాస విశ్వేశ్వరరావు ఇంట్లో ఈ వింత ఘటన వెలుగుచూసింది. కొబ్బరికాయ నుంచి చిన్న రావిచెట్టు మొలక రావడాన్ని గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియడంతో మొక్కను చూసేందుకు జనం ఆసక్తి చూపించారు.
ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో ఈ ఘటనను శివుడి మహిమగా స్థానికులు భావిస్తున్నారు. రావిచెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారని విశ్వసించే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటి వద్ద ఉన్న మొక్కను సాయిబాబా ఆలయానికి తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అంతేకాకుండా ఈ మొక్కను ఏకాదశ రుద్రులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వ్యగ్రేశ్వరం శివాలయానికి అందజేయనున్నట్లు స్థానికులు తెలిపారు.
కొబ్బరికాయ నుంచి రావిచెట్టు మొలక రావడం ఎలా సాధ్యమైందన్న ఆసక్తి ఒకవైపు, కార్తీకమాసంలో జరిగిన ఈ ఘటన దైవ మహిమేనన్న భక్తుల విశ్వాసం మరోవైపు.. ప్రస్తుతం అమలాపురంలో ఈ వింత ఘటన చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..