Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం.. ముఖ్య అతిథులు వీళ్లే

| Edited By: Narender Vaitla

Jun 11, 2024 | 7:58 AM

ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎస్‌ సమీక్షించారు. టూర్ ప్రోగ్రాం ప్రకారం ప్రధాని రేపు ఉదయం 8.20 గం.లకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి ఉ.10.40.గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారన్నారు. ఉ.10.55 గం.లకు అక్కడ సమీపంలోని ఐటి పార్కు ప్రాంగణానికి...

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం.. ముఖ్య అతిథులు వీళ్లే
Chandrababu
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణంలో ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు. దీంతో ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు.

ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎస్‌ సమీక్షించారు. టూర్ ప్రోగ్రాం ప్రకారం ప్రధాని రేపు ఉదయం 8.20 గం.లకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి ఉ.10.40.గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారన్నారు. ఉ.10.55 గం.లకు అక్కడ సమీపంలోని ఐటి పార్కు ప్రాంగణానికి చేరుకుని ఉ.11గం.ల నుంచి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12.40 గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని 12.45 గం.లకు విమానంలో భువనేశ్వర్ వెళ్లనున్నారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు..

ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బుధవారం విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. విజయవాడ నగరం నుంచి గన్నవరం వెళ్లే వాహనాలను పోలీసులు మళ్లించనున్నారు. విజయవాడ రామవరప్పాడు రింగ్ నుంచి గన్నవరం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి వెళ్లే వాహనాలతో పాటు.. అంబులెన్స్‌, అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనాలకు మాత్రమే అనుమతి ఉండనుంది. అలాగే గన్నవరం వెళ్ళే ఇతర వాహనాలు అన్నిటినీ నిలిపి వేయనున్నారు. కేవలం పాసులు ఉన్న వారికే అనుమతి ఇవ్వనున్నారు. ఇక విజయవాడలో సాధారణ వాహనలు కూడా మళ్లించనున్నారు. విజయవాడ నుంచి ఏలూరు, విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలకు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బెంజ్ సర్కిల్‌ నుంచి కంకిపాడు-పామర్రు-హనుమాన్ జంక్షన్-ఏలూరు వైపు మళ్లిస్తారు. అలాగే.. వియవాడ వెలుపల ట్రాన్స్ పోర్టు వాహనాలను మళ్లించనున్నారు.

* విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి నూజివీడు… జి. కొండూరు ఇబ్రహింపట్నం మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది.

* విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ వద్ద నుండి గుడివాడ,  పామర్రు, అవనిగడ్డ, పెనుముడి వారధి, రేపల్లె, బాపట్ల,  త్రోవగుంట,  ఒంగోలు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

* చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మేదరపెట్ల, అద్దంకి, నరసరావుపేట,  పిడుగురాళ్ళ, మిర్యాలగూడెం,  నల్గొండ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.

* ఇక హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లు వాహనాలు నల్గొండ, మిర్యాలగూడెం,  దాచేపల్లి,  పిడుగురాళ్ళ,  నరసరావుపేట, అద్దంకి, మేదరమెట్ల నుండి మళ్లించనున్నారు.

* విజయవాడ ఏలూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సులను PNBS నుంచి ఓల్డ్ PCR జంక్షన్, ఏలూరు రోడ్, హోటల్ స్వర్ణ పాలెస్, చుట్టుగుంటగుణదల , రామవరప్పాడు రింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, నున్న బైపాస్, నూజివీడు, హనుమాన్ జంక్షన్,  ఏలూరు వైపుకు మళ్లించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..