Bapatla: యువకుడ్ని సముద్రంలోకి లాక్కెళ్లిన రాకాసి అల.. గజ ఈతగాళ్లు మెరుపు వేగంతో..

| Edited By: Ram Naramaneni

Aug 04, 2024 | 3:10 PM

ఏపీలోని బాపట్ల సూర్యలంక బీచ్ లో ఓ వ్యక్తి సరదాగా ఈదుతున్నాడు. సాయంత్రం సమయం కావడంతో అలల ఉదృతి తీవ్రంగా పెరిగింది. ఇది గమనించని ఆ వ్యక్తి మరి కాస్త లోపలికి వెళ్లాడు. దీంతో ఓ పెద్ద అల వచ్చి అతడ్ని లోపలికి లాక్కెళ్లింది.

Bapatla: యువకుడ్ని సముద్రంలోకి లాక్కెళ్లిన రాకాసి అల.. గజ ఈతగాళ్లు మెరుపు వేగంతో..
Suryalanka Beach
Follow us on

అతని పేరు అచ్యుత మహేష్… వయస్సు 32. బాపట్లలోని న్యూ సాగర్ బజార్ లో నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌కు వెళ్తూ ఉంటాడు. ఎప్పటిలాగే శుక్రవారం కూడా అతని స్నేహితులతో కలిసి సూర్యలంక బీచ్ కువెళ్లాడు. అలవాటైన బీచ్ కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా నీళ్లలో ఆడుకుంటున్నాడు. సరదా శృతి మించడంతో మరింత లోతుకు వెళ్లారు. అయితే ఉన్నట్లుండి పెద్ద అల వీరిపైకి దూసుకొచ్చింది. మిగిలిన స్నేహితులు ఎలాగో అలాగా ఆ రాకాసి అల నుండి బయటపడినా… అచ్యుత్ మహేష్ మాత్రం అలకి చిక్కుకొని సముద్రంలోకి కొట్టుకుపోయాడు. నీళ్లలో మునకలు వేస్తున్న అచ్యుత మహేష్‌ను ఓడ్డున ఉన్న రక్షణ బలగాలు గమనించాయి. వెంటనే నీళ్లలోకి దూకి.. మెరుపు వేగంతో అతడిని చేరుకున్నారు గజ ఈతగాళ్లు. గట్టిగా అతన్ని పట్టుకొని జాగ్రత్తగా నీటి నుండి బయటకు తీసుకొచ్చారు. సకాలంలో గమనించి.. వెంటనే స్పందించి అచ్యుత మహేష్ ప్రాణాలను కాపాడాగలిగారు. ఈ విషయం క్షణాల్లోనే అందరికి తెలిసిపోయింది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సంద్రంలో మునిగి పోతున్న అచ్యుత మహేష్‌ను కాపాడిన రక్షణ సభ్యులను బాపట్ల ఎస్పీ తూషార్ డూడీ, డిజిపి ద్వారకా తిరుమలరావు అభినందించారు.

గత కొంతకాలంగా సూర్యలంక సముద్ర తీరంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. సూర్యలంక, రామాపురం బీచుల్లో అనేక మంది మృత్యువాత పడటంతో కొద్ది రోజుల పాటు బీచ్‌లను మూసివేశారు. వారం రోజుల తర్వాత తిరిగి.. తగిన జాగ్రత్తలు తీసుకొని బీచ్‌లను ఓపెన్ చేశారు. బీచుల్లో ఎర్ర జెండాలు ఏర్పాటు చేశారు. పర్యాటకులెవ్వరూ రెడ్ ప్లాగ్స్‌ దాటి సముద్రంలోకి వెళ్లవద్దని పోలీసులు.. ఆయా ప్రాంతాల్లో ఫెక్స్‌లు ఏర్పాటు  చేశారు. ఎప్పటికప్పుడు మైకుల్లో కూడా అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. కాని కొంతమంది తెలిసోతెలియక రెడ్ ప్లాగ్స్ దాటి వెళ్లడంతోనే సమస్యలు వస్తున్నాయని రక్షణ బలగాలు అంటున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే తీరంలో ప్రాణాలకు గ్యారెంటీ లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..