
ఎన్నికల ఫలితం కోసం గ్రామమంతా ఎదురుచూస్తున్న వేళ.. ఆ అభ్యర్థి మాత్రం ఈ లోకంలో లేకుండాపోయారు. కౌంటింగ్‌కు ముందే గుండెపోటుతో కన్నుమూసిన జనసేన అభ్యర్థికి ఎన్నికల ఫలితాల్లో విజయం వరించింది. తాను పోటీ చేసిన ఎన్నికల్లో గెలిచినట్లు తెలిసేలోపే ప్రాణాలు కోల్పోయిన ఆమె ఉదంతం గ్రామస్థులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం గ్రామానికి చెందిన గారపాటి దివ్య (28) జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఆమె గుండెపోటుతో మరణించారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో దివ్య విజయం సాధించినట్లు వెల్లడైంది. వైసీపీ అభ్యర్థిపై 352 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.
ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ఆ ఆనందాన్ని ఆస్వాదించడానికి దివ్య లేకపోవడం గ్రామస్థులను కలచివేస్తోంది. గెలుపు వార్త తెలిసిన తర్వాత గ్రామంలో ఆనందం కంటే విషాదమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థి.. ఫలితాలు వెలువడే సమయానికి లేకపోవడం స్థానికులను తీవ్రంగా బాధిస్తోంది.
దివ్యకు ప్రేమ వివాహం కాగా, ఆమెకు ఐదేళ్లు, మూడు నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం, ఇద్దరు చిన్నారులకు తల్లి దూరం కావడం కుటుంబ సభ్యులను, గ్రామస్థులను మరింత విషాదంలోకి నెట్టింది.
ఎన్నికల్లో గెలుపు సాధించినా.. ఆ విజయాన్ని కళ్లారా చూసుకోలేకపోయిన దివ్య ఉదంతం ధుమంతునిగూడెంలో విషాదాన్ని నింపింది. ఫలితాల్లో గెలిచిన అభ్యర్థి పేరు ప్రకటించినా.. ఆ విజయాన్ని పంచుకోవడానికి ఆమె లేకపోవడం స్థానికులను కన్నీటి పర్యంతం చేస్తోంది.