ఒక్క పందిరి.. ఏడాదంతా ఆదాయం.. వారానికి 2 కోతలు..

ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన యువ రైతు శేషుబాబు ఎకరానికి 1600 గుజరాతీ పెన్సిల్ దొండ మొక్కలు సాగు చేస్తున్నారు. 45 రోజుల్లో కాపు ప్రారంభమై, ప్రూనింగ్ ద్వారా అధిక దిగుబడి పొందుతున్నారు. సేంద్రీయ పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తూ, బహుళ పంటల సాగు, ప్రత్యక్ష విక్రయాలతో నిరంతరం ఆదాయాన్ని పొందుతున్నారు.

ఒక్క పందిరి.. ఏడాదంతా ఆదాయం.. వారానికి 2 కోతలు..
Ivy Gourd Farming

Updated on: Nov 11, 2026 | 3:29 PM

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ రైతు శేషుబాబు, తన ఆరు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో దొండ సాగుతో పాటు బహుళ పంటల విధానాన్ని అవలంబిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. గ్యాక్ ఫ్రూట్ పందిరి స్థానంలో దొండ సాగును ఎంచుకున్న శేషుబాబు, ఎకరానికి సుమారు 1600 గుజరాతీ పెన్సిల్ రకం దొండ మొక్కలను రెండున్నర అడుగుల దూరంలో నాటారు. అర ఎకరంలో 800 మొక్కలను సాగు చేస్తున్నారు. దొండ సాగులో మొక్క నాటిన 45 నుంచి 55 రోజుల్లోనే కాపు ప్రారంభమవుతుందని శేషుబాబు తెలిపారు. అధిక దిగుబడి కోసం తీగను పందిరిపైకి ఎక్కించే విధానం చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. ప్రధాన తీగను పెంచుతూ, పక్క నుంచి వచ్చే బ్రాంచ్‌లను ప్రతిరోజు ప్రూనింగ్ చేయడం ద్వారా తీగ త్వరగా విస్తరించి, ఐదో నెల నుంచి దిగుబడి భారీగా పెరుగుతుందని ఆయన వివరించారు. గుజరాతీ పెన్సిల్ రకం దొండ కాయ సైజు, నాణ్యతతో పాటు కోసిన తర్వాత కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని దీని ప్రత్యేకత. పంటలో పిండి నల్లి, పచ్చ పురుగు వంటి చీడపీడల సమస్యలు వస్తాయని, వాటి నివారణకు సమయానికి చర్యలు తీసుకోవడం అవసరమని శేషుబాబు పేర్కొన్నారు. ఆయన కుటుంబం సేంద్రీయ వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తోంది. జీవామృతం, వేప కషాయం, కోడిగుడ్డు-నిమ్మకాయ ద్రావణం, మీనామృతం వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం 80 నుంచి 85 శాతం వరకు సేంద్రీయ పద్ధతిలోనే సాగు చేస్తున్నామని, భవిష్యత్తులో పూర్తిగా సేంద్రీయ పద్ధతికి మారాలనే లక్ష్యంతో ఉన్నారని తెలిపారు. గతంలో రసాయనాలను ఎక్కువగా ఉపయోగించినప్పటికీ, ఇప్పుడు సహజ పద్ధతుల వైపు మారుతున్నామని ఆయన చెప్పారు.

పంట మొదలైన తర్వాత వారానికి రెండు కటింగ్స్ వరకు దిగుబడి వస్తుందని శేషుబాబు తెలిపారు. ప్రారంభంలో 10 రోజులకు రెండు-మూడు కటింగ్స్ వచ్చినా, తర్వాత వారానికి రెండు కటింగ్స్ కొనసాగుతాయని ఆయన వివరించారు. గత అనుభవంలో ఆరు నెలల్లో సుమారు రెండు టన్నుల వరకు దిగుబడి వచ్చిందని వెల్లడించారు. మార్కెట్ ధర కిలోకు రూ.40-50 వరకు పలుకుతున్నప్పటికీ, ఏడాది సగటు ధర రూ.20-25 వచ్చినా దొండ సాగు నుంచి మంచి రాబడి ఉంటుందని ఆయన అన్నారు. గతంలో ఒక సాగు నుంచి సంవత్సరానికి సుమారు రూ.75,000 వరకు ఆదాయం పొందినట్లు ప్రస్తావించారు. శేషుబాబు కేవలం దొండ పంటకే పరిమితం కాకుండా, ఆరు ఎకరాల విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్, బోడ కాకర, గ్యాక్ ఫ్రూట్, లక్ష్మణ ఫలం, దొండ, రేగి, మామిడి, నిమ్మ, బొప్పాయి, క్యాక్టస్, జామ, నేరేడు వంటి 12 రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఒక పంటలో ధర లేదా దిగుబడి అనుకూలంగా లేకపోయినా, మరో పంట నుంచి ఆదాయం వచ్చేలా పంటలను విభజించుకోవాలనేది ఆయన ఆలోచన. పంటను హోల్‌సేల్ మార్కెట్‌కు కాకుండా, నేరుగా రైతుబజార్, వినియోగదారులకు రిటైల్‌గా అమ్ముతూ అధిక లాభాలు పొందుతున్నారు. సంవత్సరంలో వేర్వేరు సమయాల్లో వేర్వేరు పంటల నుంచి డబ్బు వచ్చేలా తన వ్యవసాయాన్ని ఒక “ఏటీఎం” లా మార్చుకోవాలన్నది ఆయన లక్ష్యం. సన్నకారు రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా, నాలుగు ఐదు రకాల పంటలను విభజించి సాగు చేస్తే రిస్క్ తగ్గించుకోవచ్చని శేషుబాబు సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us