
తెలంగాణ-ఏపీ మధ్య కనెక్టివిటీని అందించడంలో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే 65 కీలకంగా మారింది. ఈ హైవే ఏపీ, తెలంగాణను కలుపుతుంది. దీంతో రోజూ వేలాది మంది వాహనదారులు ప్రయాణిస్తుంటారు. ఈ ముఖ్యమైన హైవేను మరింత విస్తరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ముందడుగు వేసింది. ప్రస్తుతం ఈ హైవే నాలుగు లైన్లుగా ఉండగా.. ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు లైన్లుగా విస్తరించేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు హైవే విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. వచ్చే ఏడాది జనవరి నుంచి పనులు చేపట్టాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. తాజాగా ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణపై ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్ సంతోష్‌కుమార్‌తో చర్చించారు. అనంతరం ఈ ప్రకటన చేశారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరుగుతోంది. ఈ హైవే మీదుగా ఏపీలోని తీర ప్రాంతాలకు ప్రయాణికుల రాకపోకలు పెరగడంతో పాటు సరుకు రవాణా కూడా పెద్ద మొత్తంలో జరుగుతోంది. దీని వల్ల హైవే సామర్థ్యం సరిపోవడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని హైవేను విస్తరించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఎట్టకేలకు రహదారి విస్తరణకు అధికారులు సిద్దమయ్యారు. నవంబర్ 11లోగా ఆరు లైన్లకు విస్తరించేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టనుండగా.. జనవరి నుంచి పనులను ప్రారంభించే అవకాశముంది. అలాగే రహదారి ఇరువైపుల సర్వీస్ రోడ్లను కూడా అభివృద్ది చేయనున్నారు. దీని వల్ల హైవే పక్కన ప్రాంతాల ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. సర్వీస్ రోడ్ల ద్వారా సులువుగా తమ ప్రాంతాలకు చేరుకోవచ్చు. హైవే విస్తరణ వల్ల వాహనాల రద్దీ తగ్గడంతో పాటు వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వనుంది.
ప్రస్తుతం ఈ హైవే హైదరాబాద్-విజయవాడ మధ్య 270 నుంచి 275 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తెలంగాణ-ఏపీ మధ్య రాకపోకలకు ప్రధాన మార్గంగా ఉంది. తెలంగాణ పరిధిలోని కొన్ని ప్రధాన నగరాలు, ఏపీలోని పలు ప్రాంతాలు కీలకంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ హైవేపై ప్రమాదాల నివారణ కోసం కొన్ని పనులు చేపడుతున్నారు. అండర్ పాస్‌లు, జంక్షన్లను అభివృద్ది చేస్తున్నారు. సర్వీస్ రోడ్లు, అవసరమైన చోట ప్రవేశ సదుపాయాలు కల్పించేలా పనులు చేపడుతున్నారు. చౌటుప్పల్, టేకుమట్ల ప్రాంతాల్లో వాహనాలు రోడ్డు దాటేందుకు అండర్ పాస్‌లు, జంక్షన్లను అభివృద్ది చేస్తున్నారు. ఇటీవల ఈ హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో వీటిని కట్టడి చేసేందుకు అండర్ పాస్‌ల నిర్మాణం చేపడుతున్నారు.